YCP Govt Neglected Maintenance of Drains and Irrigation Canals: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి రైతుల పాలిట ప్రకృతి విపత్తులను మించి శాపంగా మారాయి. జగన్ సర్కారు వైఖరి వల్ల ధాన్యాగారంగా ఉండే కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో కాలువలు, డ్రెయిన్లు పూడుకుపోయాయి. ఏటా పంట కాలానికి ముందే సాగు కాలువలు, డ్రెయిన్లకు మరమ్మతులు, నిర్వహణ పనులు చేయాల్సి ఉండగా జగన్ సర్కారు ఇందుకోసం వెచ్చించిన నిధులూ అంతంతే. ఆ కాస్త నిధులతోనూ నామమాత్రంగా పనులు చేపట్టి స్వాహా చేసిందే ఎక్కువ. వెరసి తుపాను ధాటికి కాలువలు, డ్రెయిన్లలో ప్రవాహాలు ముందుకు సాగక పంటలు నీటమునిగాయి. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు 23 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాలువలు, ఆ పంటల్లోని నీటిని బయటకు పంపే డ్రెయిన్ల నిర్వహణ దారణంగా ఉంది. ఫలితంగా 5 లక్షల ఎకరాలకు పైగా పొలాలు జలదిగ్బంధమయ్యాయి.
రైతులను పరామర్శించాలంటే పొలాల్లోకే వెళ్లాలా ఏంటీ? - వేదిక పైనుంచి జగన్ ముసిముసి నవ్వులతో పలకరింపులు
Combined Guntur District: ఉమ్మడి గుంటూరు జిల్లాలో అస్తవ్యస్త డ్రెయిన్లు రెండు లక్షల ఎకరాలకుపైగా పంటలను నీటముంచాయి. గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోనూ అప్పాపురం, కొమ్మమూరు కాలువ దుస్థితితో అన్నదాతలకు నష్టం జరిగింది. బాపట్ల జిల్లాలో కారంచేడు-స్వర్ణ మధ్య కొమ్ములూరు కాలువ తెగిపోయింది. నిర్వహణకు నిధులులేక బలహీనంగా మారిన కాల్వ కట్ట తెగిపోవడంతో పంటలు నీటమునిగాయి. చినగంజాం మండలంలో గొనసపూడి డ్రెయినేజి కాలువకు గండిపడింది. ఇందులో తుమ్మ చెట్లు అడ్డుగా నిలిచిపోవడంతో నీరంతా పొలాలను ముంచెత్తింది. భట్టిప్రోలు ప్రధాన డ్రెయిన్ నిర్వహణ అంతంతమాత్రంగా ఉంది. రేపల్లె మెయిన్ డ్రెయిన్‌కు కోత పడి పొలాల్లోకి నీరు చేరాయి. రొంపేరు డ్రెయిన్‌లో జమ్ము, తూటికాడ పెరిగిపోవడంతో ప్రవాహాలు పొలాలను ముంచెత్తాయి.
Joint Krishna District: ఉమ్మడి కృష్ణా జిల్లాలో వ్యవసాయశాఖ అంచనాల ప్రకారమే 2 లక్షల 33 వేల ఎకరాలు ముంపులో చిక్కాయి. గూడూరు మండలంలో 17 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న వడ్లమన్నాడు డ్రెయిన్ గట్లకు సమాంతరంగా ప్రవహించింది. ముక్కొల్లులోని వంతెన వద్ద గూడు అల్లుకుపోయి మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. మచిలీపట్నం సమీపంలోని శివగంగ మేజర్ డ్రెయిన్, లంకపల్లి కాలువ, మల్లవోలు, కుక్కలకోడు ఇలా మచిలీపట్నం నియోజకవర్గంలో అన్ని మురుగుకాల్వలు అధ్వానంగా ఉన్నాయి. పెడన, గూడురు మండలాల్లో 24.7 కిలోమీటర్ల మేర ఉన్న లజ్జబండ కాలువ ఇసుక మేటలు వేసేసింది.
తీరని నష్టాన్ని మిగిల్చిన మిగ్‌జాం తుపాను - ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న లంక రైతులు
Combined East Godavari District: ఏటా వేసవిలో కాలువలకు నీటిని నిలిపేసిన తర్వాత డ్రెయిన్లకు, కాలువలకు మరమ్మతు పనులు చేపట్టడం ఆనవాయితీ. వీటిని క్లోజర్ పనులుగా పిలుస్తుంటారు. జగన్ సర్కారులో ఆ క్లోజర్ పనులకు పాడేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వెయ్యీ 47 ప్రధాన, మధ్య, చిన్న తరహా, రెవెన్యూ డ్రెయిన్లు 2 వేల 826 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. డ్రెయిన్లలో పూడిక పేరుకుపోవడం, ఆక్రమణల వల్ల నీరు పొలాలను ముంచెత్తే పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది ముమ్మిడివరం మండలం అయినాపురం రైతులు ఖరీఫ్‌లో పంట విరామం ప్రకటించడంతో మంత్రులు డ్రెయిన్ల ఆధునికీకరణ చేపడతామని ప్రకటించారు.
కేవలం ఒక్క రంగరాయకోడు పూడిక తీయించి మిగతావాటిని వదిలేశారు. ఐ.పోలవరం మండలం కేశనకుర్రులోని పెరుమాళ్లరాజుకోడు పూర్తిగా మూసుకుపోవడంతో 800 ఎకరాల్లోని పంట చేలు ముంపుబారిన పడ్డాయి. అయినవిల్లి మండలం నేదునూరు, విలస మధ్య ఉన్న కుమ్మర కాలువ పూడికపోవడం వల్ల 4 వేల ఎకరాలు ముంపులో చిక్కుకున్నాయి. ముమ్మిడివరం మండలం క్రాపచింతలపూడి వద్ద ఉన్న డ్రెయిన్ తూరలు పూడుకుపోవడంతో పొలాలన్నీ ముంపులోనే ఉన్నాయి. గోదావరి తూర్పు డెల్టా పరిధిలో 691, మధ్య డెల్టాలో 3 వేల 149, ఏలేరు ఇరిగేషన్ డివిజన్ పరిధిలో 126 ఆక్రమణలను గతంలోనే గుర్తించినా చర్యలు తీసుకోవడం లేదు.
రైతులను నట్టేట ముంచిన జగన్ - నాలుగున్నరేళ్లలో ఒక్క టార్పాలిన్‌నూ ఇవ్వని వైసీపీ ప్రభుత్వం
రాష్ట్రంలో మురుగుకాలువలు ఎంత దుర్భరంగా ఉన్నాయో కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని ఈ కాలువను చూస్తే అర్థమైపోతుంది. సుంకరపాలెం నుంచి లచ్చిపాలెం వరకు ఐదు కిలోమీటర్ల మేర ఉన్న మురుగుకాలువ గుర్రపుడెక్కతో మూసుకుపోయింది. 6 అడుగుల వెడల్పున ఉండాల్సిన కాలువ రెండున్నర మీటర్ల గట్టు ఆక్రమణల్లో చిక్కుకుంది. మురుగు కాలువలోని ముంపు నీరు ఆత్రేయ గోదావరిలోని వెళ్లకపోవడంతో 2 వేల ఎకరాల్లో పంట నీటమునిగింది.
గోదావరి పశ్చిమ డెల్టాలో దాదాపు 40 వేల ఎకరాలకు పైగా ముంపులోనే చిక్కుకుంది. ఈ డెల్టాలోని పలు డ్రెయిన్లు ఆక్రమణతో కుచించుకుపోతున్నాయి. నిర్వహణ పనుల కోసం ఏటా 10 నుంచి 12 కోట్ల రూపాయల మధ్య నిధులు కేటాయిస్తున్నారు. డ్రెయిన్లలో మట్టిపూడికతీత, అవుట్‌లెట్లు, ఇన్‌లెట్ల పునర్నిర్మాణం, బలహీనపడినచోట్ల గట్ల సంరక్షణ, మట్టిపూడికతీత వంటి పనులకు వెయ్యి కోట్లకు మించి నిధులు అవసరమని 2022 మే నెలలో ప్రతిపాదనలు పంపారు. అందుకు తగ్గట్లుగా నిధుల మంజూరు లేదు. పనులూ జరగలేదు. అదే నేడు రైతుల పాలిట శాపమైంది.