పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు ఈ రెండు బిల్లులు కేంద్రానికి పంపడంలో ఎందుకింత జాప్యమని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఎస్ఈసీగా రమేశ్ కుమార్ నియామకంలో ఎందుకింత తాత్సారం చేశారని నిలదీశారు. ఆర్టికల్ 243(కె) ఏపీలో ఉల్లంఘించడం అక్షర సత్యమన్న యనమల.. లక్ష్మణరేఖ రాష్ట్రం అతిక్రమించినప్పుడు కేంద్రమే జోక్యం చేసుకోవాలని తెలిపారు. అధికారాల విభజన కేంద్ర రాష్ట్రాల మధ్య స్పష్టంగా జరిగిందని.. అవశేష అధికారాలన్నీ కేంద్రానికే రాజ్యాంగం దఖలు పరిచిందని గుర్తుచేశారు.
పీపీఏల రద్దుపై కేంద్రం జోక్యం వల్లే రాష్ట్రం వెనక్కి తగ్గిందని.. రెండు బిల్లులపై ఆర్టికల్ 200,201 ప్రకారం రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాలని సూచించారు. ఒక రాజధాని అనే విభజన చట్టం సెక్షన్ 5(2)(1), సెక్షన్ 6లో ఉందని యనమల వివరించారు. సెక్షన్లు 94(3),94(4) ప్రకారమే కేంద్రం ఇచ్చిన నిధులతో రాజధాని మౌలిక సదుపాయల అభివృద్ది జరిగిందన్నారు.
రాష్ట్రంలో అధికార పరిధి అతిక్రమణ జరుగుతోందని యనమల ఆరోపించారు. ఆర్టికల్ 200 కింద రాష్ట్రపతి ఆమోదం మినహా ఈ 2బిల్లులపై ప్రత్యామ్నాయం లేదన్నారు. ఈ రెండు బిల్లుల అంశంలో తక్షణమే కేంద్రం జోక్యం చేసుకుని చక్కదిద్దాలని కోరారు.
ఇదీ చదవండి : లారీని ఢీకొట్టిన కారు..ఎస్‌బీఐ ఉద్యోగి సజీవదహనం