ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద సోమవారం జలశక్తి అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభకు ఎమ్మెల్యే విడదల రజిని హాజరైయ్యారు. జల సంరక్షణ ఇంటి నుంచి మొదలు కావాలని, నీటి వృథా అరికట్టి ప్రతినీటి చుక్క భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని, ఇందులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఇంటి పైకప్పు నీరు వృథాగా పోకుండా ఇంకుడు గుంతలు, రైతులు ఉపాధి హామీ పథకం ద్వారా పొలాల్లో ఉచితంగా సేద్యపు కుంటలు తవ్వించుకోవాలని కోరారు.
మానవాళి మనుగడకు జల వనరుల ఆవశ్యకతను సంయుక్త కలెక్టర్ ప్రశాంతి వివరించారు. అన్ని శాఖల అధికారులు నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను భాగస్వాములను చేయాలని తెలిపారు. అందరితో జల సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రూఫ్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్‌కు భూమిపూజ చేశారు. ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో చైతన్య, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, డీపీవో కేశవరెడ్డి, డీడీఏ (అగ్రానమీ) మురళీ, తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో మాధురి, వైకాపా నేతలు కల్లూరి విజయ్‌కుమార్, చల్లా యజ్ఞేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం- 13మంది దుర్మరణం