Complaint by women lawyers against Ramgopal Varma : దర్శకుడు రాంగోపాల్ వర్మపై మహిళా న్యాయవాదులు గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాంగోపాల్ వర్మతో పాటు ఆచార్య నాగార్జున వర్సిటీ వీసీపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ మేరకు పెదకాకాని సీఐ సురేష్ బాబుకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఇటీవల ఆచార్య నాగార్జున వర్సిటీలో జరిగిన అకాడమిక్ ఎగ్జిబిషన్లో దర్శకుడు రామగోపాల్ వర్మ అసభ్యకరమైన రీతిలో మాట్లాడారని వారు గుర్తు చేశారు. మహిళలంటే ఏమాత్రం గౌరవం లేని వ్యక్తిగా వర్మ వ్యవహరించారని వారు విమర్శించారు. ప్రపంచంలో మగవారంతా చనిపోయి వర్మ మాత్రం మిగిలి ఉండాలన్న ఆయన వాదనను మహిళా న్యాయవాదులు ఖండించారు. విద్యార్థులుండే ఇలాంటి వేదికపై పర్వర్టెడ్ రాంగోపాల్ వర్మను రప్పించిన వీసీపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదును స్వీకరించిన సీఐ సురేశ్ బాబు... న్యాయపరంగా సలహాలు తీసుకుని కేసులో ముందుకువెళ్తామని చెప్పారు.
యూనివర్సిటీలో ఆర్జీవీ మాట్లాడిన తీరు మహిళల మనోభావాలు దెబ్బతినేలా ఉంది. కాబట్టి వీసీతో పాటు రాంగోపాల్ వర్మపై ఫిర్యాదు చేశాం. 25ఏళ్లు పూర్తయిన తర్వాత ఆయనకు పట్టాతో ఏం అవసరం వచ్చిందో.. ఆయన్ను పిలిపించాల్సిన అవసరం ఏం వచ్చిందో వీసీకి, ఆయనకే తెలియాలి. విద్యార్థుల ముందు ఆయన వ్యవహారశైలి చాలా అసహ్యంగా ఉంది. తగిన చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం కొనసాగుతుంది. - లక్ష్మీ సుజాత, మహిళా న్యాయవాది
వైస్ ఛాన్స్లర్.. ఒక బాధ్యతలున్న వ్యక్తి ఆర్జీవీ లాంటి పర్వర్టెడ్ పర్సన్‌ను పిలిపించాల్సిన అవసరం ఎందుకొచ్చింది. విద్యార్థులను నేర పూరిత ఆలోచనల దిశగా ప్రభావితం చేశాడని మేం భావిస్తున్నాం. ఆయన మాట్లాడిన మాటలు అసలు చెప్పుకోలేనివిగా ఉన్నాయి. అక్కడున్న ప్రొఫెసర్లు, లెక్చరర్లు, టీచర్లు తలదించుకున్నారు. మహిళలే కాదు.. పురుషులు కూడా తలదించుకున్న పరిస్థితుల్లో వేదికపై ఉన్న వైస్ ఛాన్స్లర్ తోపాటు ప్రొఫెసర్లు చప్పట్లు కొడుతూ ప్రోత్సహించడం మాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఇది వీసీ చేసిన పెద్ద పొరపాటు. ఆర్జీవీతో పాటు వీసీపై కూడా చర్యలు తీసుకోవాలి. ఆర్జీవీకి సామాజిక బాధ్యత తెలియదు. మహిళలను విలాస వస్తువుగా చూడడం తగదు. - పద్మవల్లి, మహిళా న్యాయవాది
ఈ నెల 15న యూనివర్సిటీలో రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై బార్ అసోసియేషన్ తరఫున మహిళా న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఆయా ఫిర్యాదులను లీగల్ ఒపీనియన్ కోసం పంపించిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటాం. - సురేశ్ బాబు, పెదకాకాని సీఐ
ఇవీ చదవండి :