మంగళగిరిలో ఓ యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతడిని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు. కుటుంబసభ్యులకు నిత్యావసర సరుకులు అందించాల్సిన వాలంటీర్లు పట్టించుకోవడం మానేశారు. తమకు కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరినా అధికారులు ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి తాగునీటి క్యాన్ కోసం బయటకు వచ్చాడు. గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
నీళ్ల కోసమే బయటకొచ్చామని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. తమ ఇంట్లో అనారోగ్యంతో మహిళ ఉందని చెప్పినా.. పోలీసులు కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. గత రాత్రి ఆ మహిళకే.. గుండెనొప్పి రావడంతో అంబులెన్స్‌లో విజయవాడ తీసుకెళ్లారు. మార్గ మధ్యలోనే మహిళ మృతి చెందింది. అధికారుల నిర్లక్ష్యంతోనే మహిళ ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.