పంచాయతీ ఎన్నికల విధుల నుంచి గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, మాచర్ల సీఐ రాజేశ్వరరావుని తప్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. 2020 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలో గుంటూరు జిల్లాలో జరిగిన దౌర్జన్యాలు నియంత్రించటంలో విఫలమయ్యారంటూ వీరిద్దరినీ అప్పట్లోనే ఎన్నికల కమిషనర్ తప్పించారు. అయితే కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడటంతో వారిపై చర్యలు ఆగిపోయాయి. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపటంతో శనివారం నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. అప్పట్లో చర్యలు తీసుకున్న కలెక్టర్, సీఐని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు.
గతేడాది స్థానిక ఎన్నికల సమయంలో మాచర్లలో తెదేపా ముఖ్య నేతలపై దాడిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన సీఐ రాజేశ్వరరావు... సరైన చర్యలు చేపట్టకపోవటం, దాడికి పాల్పడిన వారిపై సరైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయలేదన్న ఆరోపణలు వచ్చాయి. మాచర్ల నియోజకవర్గం పరిధిలో మున్సిపాలిటీతో పాటు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అన్నీ ఏకగ్రీవమయ్యాయి. విపక్షాలు కనీసం నామినేషన్లు వేయలేని పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని విపక్షాలు చెబుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. కొన్నిచోట్ల పోలీసులే అభ్యర్థులను బెదిరించిన దాఖలున్నాయి. ఈ ఘటనలను నియంత్రించటంలో విఫలం కావటంతో రాజేశ్వరరావుపై చర్యలు తీసుకున్నారు ఎస్‌ఈసీ. అప్పట్లో గుంటూరు గ్రామీణ ఎస్పీగా ఉన్న విజయరావుని కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించారు. ప్రస్తుతం ఆయన రైల్వే ఎస్పీగా ఉన్నారు.
ఇదీ చదవండి: అధికారులపై చర్యలు కోరుతూ సీఎస్, డీజీపీకి ఎస్‌ఈసీ లేఖ