చెరువులలో చుక్క నీరు లేదు.. ఎక్కడ చూసినా నీటి కోసం ప్రజల ఎదురుచూపులే. తాగేందుకు 10లీటర్ల నీళ్లు 15 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. గృహావసరాలకు మాత్రం సరిపడా నీరు లేక సమస్యలు పడుతున్నారు. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రాతినిథ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితి ఇది.
నియోజకవర్గంలోని 24 గ్రామాల్లోని చెరువులు ఎండిపోవడం వల్ల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం తరఫున మంచినీటి ట్యాంకర్లు సరఫరా చేస్తున్నప్పటికీ అవి సరిపోవటం లేదు. మూడురోజులకోసారి గ్రామానికి 3 ట్యాంకర్ల చొప్పున మాత్రమే పంపిణీ చేస్తున్నారు. నీటి కోసం పనులు మానుకోవాల్సి వస్తోందని ప్రజలు అంటున్నారు. అయితే పూర్తిస్థాయిలో సమస్యను తొలగిస్తామని మంత్రి సుచరిత హామీ ఇచ్చారు.