గుంటూరు జిల్లాలోని తీర ప్రాంతాల్లో తాగునీటి సమస్య.. ప్రజలను వేధిస్తోంది. గుక్కెడు నీటి కోసం ఊరి పొలిమేరలు దాటినా.. ఫలితం లేని పరిస్థితి.. కొన్ని గ్రామాల ప్రజలను ఇబ్బంది పెడుతోంది. బోర్లు వేద్దామనుకున్నా... తీర ప్రాంతం వల్ల ఉప్పు నీరే వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య రేపల్లె, నిజాంపట్నం మండలంలోని తీర ప్రాంతాల్లో మరీ ఎక్కువగా ఉంది.
శుద్ధి చేయని చెరువులు
సుమారు 31 గ్రామాలకు తాగునీటి సమస్య తీర్చేందుకు రేపల్లె మండలం మృత్యుంజయ పాలెంలో ఏర్పాటు చేసిన తాగునీటి పథకం ఆచరణకు నోచుకోవడం లేదు. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పైపు లైన్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఈ పరిస్థితికి తోడు... తాగునీటి చెరువుల్లో అధికారులు శుద్ధి పనులు చేయని కారణంగా.. నీరంతా పచ్చగా మారిపోయింది.
చందాలు వేసుకుని!
పంచాయతీ పైపులైన్ల ద్వారా వచ్చే రెండు రోజులకోసారి నీరు సరఫరా అవుతోందని తీరప్రాంత వాసులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైపులైన్లు తుప్పుపట్టిన కారణంగా.. పలు గ్రామాల్లో మరమ్మతులను సొంత డబ్బులు వేసుకొని బాగు చేయించుకుంటున్న పరిస్థితి ఉందని బాధితులు వాపోతున్నారు.
నీళ్లివ్వాలి..
చెరువులో నీటిని శుద్ధి చేసి.. పైపులైన్లకు మరమ్మతులు చేయించి.. నీరందేలా చేయాలని బాధిత ప్రజలు అధికారులను కోరుతున్నారు. తాగునీటి సమస్య తీర్చేందుకు గత ఏడాది నిజాంపట్నం, రేపల్లె మండలాల్లోని పలు గ్రామాల్లో అధికారులు వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. ఈ ఏడాది కూడా సమస్య పరిష్కారానికి వెంటనే అలాంటి చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.