గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వినోద్ అనే యువకుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగకుండా.. ఆమె కుటుంబసభ్యులు, పోలీసులు తన కుమారుడిని అడ్డుకున్నారని యువకుడి తండ్రి ఆరోపించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15న ఇద్దరూ పెళ్లి చేసుకునేందుకు వెళ్తుంటే.. అడ్డుకుని అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు.. ఆమెను ఇంటికి బలవంతంగా పంపించేశారని చెప్పారు.
ఇద్దరూ మేజర్లే అయినా.. రాజకీయ పలుకుబడితో అమ్మాయి కుటుంబీకులు.. పోలీసులతో తమను ఇబ్బంది పెడుతున్నారని యువకుడి తండ్రి ఆవేదన చెందారు. ఈ ఒత్తిడి భరించలేకే తన కుమారుడు ఆత్మహత్యకు యత్నించినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి వినోద్ రాసిన ఓ లేఖను కూడా చూపించారు.
ఈ విషయంపై.. పోలీసులు స్పందించారు. ఆరోపణలు సరికాదని సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి అన్నారు. వినోద్ ప్రేమ వ్యవహారంతో తమ సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. పెళ్లిళ్లు చేయడం తమ పని కాదని.. ఎవరైనా చేసుకుని వస్తే.. అపాయం ఉన్నవారికి భద్రత కల్పించడం తమ విధి అని వివరించారు. పోలీసులపై వచ్చిన ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చూడండి: