ప్రపంచ విజేతలుగా నిలిచే అవకాశం కేవలం క్రీడలతోనే సాధ్యమని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల అన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఉత్సవాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన జ్వాల... గెలుపోటముల్ని తట్టుకుని జీవితంలో ముందుకు వెళ్లగలిగే శక్తిని ఆటలు ఇస్తాయని అభిప్రాయపడ్డారు. క్రీడల ద్వారా ఎంతో మంది ఉన్నత స్థానాలకు వెళ్లి దేశ ప్రతిష్ఠను పెంచారన్నారు. ప్రతి విద్యార్థి తరగతి గదులకే పరిమితం కాకుండా సమాజంలో ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు.
'ఆటలతో మానసిక దృఢత్వం'
విద్యార్థుల్లో ఉన్న క్రీడా సామర్థ్యాల్ని, కళలను వెలికి తీసే లక్ష్యంతో 16 సంవత్సరాలుగా విజ్ఞాన్ మహోత్సవ్ నిర్వహిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ లావు రత్తయ్య వెల్లడించారు. ఆటపాటల ద్వారా విద్యార్థుల్లో శారీరక, మానసిక దృఢత్వం పెంచటమే తమ లక్ష్యమని వివరించారు. దేశంలోని 20కి పైగా విశ్వవిద్యాలయాల నుంచి వేలాది మంది విద్యార్థులు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. గురువారం ప్రారంభమైన.. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 1వ తేదీ వరకూ జరగనున్నాయి. కార్యక్రమం ప్రారంభం సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా యువత సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేసింది. కళాకారులు పలు జానపద, శాస్త్రీయ నృత్య రూపకాలకు అనుగుణంగా నర్తించి వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు.