గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలంలో గత నెల 28న ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను మంగళగిరి డీఎస్పీ దుర్గప్రసాద్ వెల్లడించారు.
అసలు ఏం జరిగింది...
పెద్దకాకాని మండలం ఆగతవరప్పాడు భవానిపురంకు చెందిన రామకృష్ణ, వంశీల ఇళ్లు ఎదురెదురుగా ఉన్నాయి. ఫలితంగా వంశీ అక్కతో రామకృష్ణకు పరిచయం ఏర్పడింది. వారిరువురు చనువుగా ఉంటున్నారు. ఈ చనువు కాస్తా... వంశీ అక్క కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య విభేదాలకు దారితీసింది.
ఎలా జరిగింది....
అక్కాబావల మధ్య తగాదాలకు కారణమైన రామకృష్ణపై వంశీ కోపం పెంచుకున్నాడు. ఈనెల 28న రాత్రి రామకృష్ణను తీసుకుని.. స్థానికంగా ఉన్న సాయిబాబా గుడి వెనుక ఖాళీ ప్రదేశంలోకి వెళ్లారు. ఇరువురి మధ్య మాటకు మాట పెరిగింది. కోపొద్రిక్తుడైన వంశీ... వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను రామకృష్ణపై పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఉన్న రామకృష్ణను స్థానికులు గుర్తించి గుంటూరులోని హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై సీఐ శోభన్ బాబు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి:
అరగంటలో రూ.అరలక్ష మాయం