UTF protest on CPS : మూడో తేదీన గన్నవరంలో తలపెట్టిన సంకల్ప దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా యూటీఎఫ్ నేతలు దీక్షలు చేపట్టారు. కాకినాడ ధర్నా చౌక్ వద్ద యూటీఎఫ్ నేతలు సంకల్ప దీక్షలో పాల్గొన్నారు. ఉపాద్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని.. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానన్న జగన్ హామీని నిలబెట్టుకోవాలని మాత్రమే అడుగుతున్నామని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం సాకుగా చూపడం సరికాదన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేసిన విషయం గుర్తు చేస్తూ.. మన ప్రభుత్వం అదే పంథా అనుసరించాలని డిమాండ్ చేశారు.
నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన జగన్.. సీఎం అయ్యాక అన్నిరకాల నిరసలను అడ్డుకుంటున్నారని నెల్లూరులో యూటీఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేకపోవడం వల్లే సీపీఎస్ రద్దు హామీ ఇచ్చామని ఇతరులతో చెప్పించడం కాకుండా.. హామీ ఇచ్చిన సీఎం జగన్ నేరుగా సమాధానం చెప్పాలని కడప యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు.
విజయవాడలోని కేంద్ర కార్యాలయంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు సారథ్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఎస్ రద్దుపై అసెంబ్లీ సమావేశాల్లోపు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే.. మిగిలిన సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రకటించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో దీక్ష చేపట్టిన ఉపాధ్యాయులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగులను మోసం చేయకుండా ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: