కొవిడ్ పరిస్థితుల కారణంగా ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నామని ఓ వృద్ధురాలిని నమ్మబలికి.. అనంతరం ఆమెను కట్టిపడేసి నగలను దోచుకెళ్లారు ఇద్దరు యువకులు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పండరీపురం 4వలైనులో పుచ్చకాయల సీతారావమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. మంగళవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో ఇద్దరు యువకులు వృద్ధురాలి నివాసం వద్దకు వచ్చారు. తాము ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వస్తున్నామని, ఆరోగ్య పరీక్షలు చేయాలంటూ నమ్మబలికారు.దీనితో వృద్ధురాలు వారిని లోపలికి ఆహ్వానించింది. లోపలికి వెళ్లిన యువకులు తలుపులు మూసివేసి.. వృద్ధురాలి చేతులను తాళ్లతో కట్టివేశారు. నోట్లో బట్టలు కుక్కి అరిస్తే చంపుతామంటూ బెదిరించారు. అనంతరం వృద్ధురాలి ఒంటిపై, ఇంట్లో ఉంచిన 17 సవర్ల బంగారు ఆభరణాలు, ఆమె పర్సులోని రూ.4వేల నగదు చోరీ చేసి అక్కడి నుంచి ఉడాయించారు. ఘటన జరిగిన కొద్దిసేపటికి స్థానికులు గమనించి వృద్ధురాలి కట్లు విప్పారు. వృద్ధురాలు చిలకలూరిపేట అర్బన్ పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండీ.. 2 డోసులు తీసుకున్న 79% మందిలో యాంటీబాడీలు!