మత్తు కోసం శానిటైజర్ తాగి ఇద్దరు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో శనివారం జరిగింది. తాడికొండ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని బడెపురం గ్రామానికి చెందిన మొగిలి శంకర్, మద్దినేని సాంబశివరావు, సూరి ముగ్గురు మిత్రులు. కలసి మద్యం తాగుతుంటారు. మత్తుకు అలవాటుపడ్డ వీరు..కొద్దీ రోజులుగా శానిటైజర్ తాగుతున్నారు.
ముగ్గురు కలసి శుక్రవారం సాయంత్రం శానిటైజర్ సేవించారు. కొద్ది సేపటికి శంకర్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో చికిత్స నిమిత్తం అతడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి శంకర్ మృతి చెందాడని మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరొక వ్యక్తి మద్దినేని సాంబశివరావు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ శనివారం మరణించాడు. శంకర్, సాంబశివరావుల అంత్యక్రియలు శనివారం బడెపురంలో జరిగాయి. తాడికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: