దేశంలో రైళ్ల రాకపోకలతో రైల్వే స్టేషన్లు కళ సంతరించుకున్నాయి. గుంటూరు స్టేషన్లో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, హౌరా ఎక్స్‌ప్రెస్ ఆగుతున్నాయి. దీనికి అనుగుణంగా రైల్వే స్టేషన్లో అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు రైలు రావడానికి ముందు.. వచ్చి వెళ్లిన తరువాత.. రైల్వే స్టేషన్ అంత శానిటైజేషన్ చేస్తున్నారు. ముందస్తుగా ప్రయాణికులను తనిఖీ చేసేందుకు వీలుగా మొదటి ప్లాట్ ఫామ్‌పై ప్రత్యేక గదులు ఏర్పాటుచేశారు. టికెట్లు చేతికి తాకకుండా కంప్యూటర్ సాయంతో స్కాన్ చేసి రిజర్వేషన్ సదుపాయం ఉన్న వారిని స్టేషన్‌లోపలికి అనుమతిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను సేకరించి.. థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. వారిలో ఏవరికైనా కరోనా లక్షణాలు కన్పిస్తే వెంటనే వారిని సమీప కోవిడ్ ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు.
స్క్రీనింగ్‌లో మాములుగా ఉన్నవారికి 14 రోజులపాటు ఇంట్లోనే ఉండాలంటూ చేతిపైన స్టాంపులు వేస్తున్నారు. పరీక్షలు చేయడంలో, వివరాలు సేకరించడంలో రైల్వే సిబ్బంది, ఆరోగ్య శాఖ అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు భాగస్వామ్యులయ్యారు. గుంటూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రైలు బయల్దేరే సమయానికి కనీసం గంట ముందే స్టేషన్‌కు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణికులు అందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాకే.. స్క్రీనింగ్ కోసం లోపలికి అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ వారికి కేటాయించిన ప్రాంతాల్లో వేచి ఉండే విధంగా రైల్వే రక్షక దళం పర్యవేక్షిస్తున్నారు. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి. 'జగనన్నా.. మీ రుణం తీర్చుకోలేనిది'