తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 15వ తేదీన నరసరావుపేటలో నిర్వహిస్తున్న కామధేనుపూజలో సీఎం జగన్ పాల్గొననున్నారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు డీఎస్పీ విజయభాస్కరరావు తెలిపారు. ఆర్టీసీ, వివిధ వాహనాలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయన్నారు. సత్తెనపల్లి రోడ్ నుంచి మున్సిపల్ స్టేడియం వైపు వాహనాలకు అనుమతి లేదని తెలిపారు. అలాగే కామధేనుపూజ కార్యక్రమానికి హాజరయ్యే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ వసతులు ఏర్పాటు చేశామన్నారు. సాధారణ వాహనాలు సత్తెనపల్లి రోడ్డులోని అయ్యప్ప స్వామి గుడి, వాసవి కాంప్లెక్స్, పాత మార్కెట్ యార్డ్ పక్కన పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. వీఐపీ పార్కింగ్ పాత మార్కెట్ యార్డ్, ద్విచక్ర వాహనాలకు రామచంద్ర ఆలయం వెనుక ఉంటుందని తెలిపారు.
గుంటూరు నుంచి నరసరావుపేటకు వచ్చే వాహనాలు బైపాస్ రోడ్డు నుంచి చిత్రాలయా సెంటర్ మీదుగా వెళ్లాలని సూచించారు. సత్తెనపల్లి వైపు వెళ్లే వాహనాలు గుంటూరు రోడ్డులోని ఇస్సపాలెం బైపాసు నుంచి వెళ్లాలన్నారు. పిడుగురాళ్ల నుంచి పట్టణంలోకి వచ్చే వాహనాలు రావిపాడులోని చెక్ పోస్ట్ వద్దనున్న బైపాస్ నుంచి పాలపాడు రోడ్డు మీదుగా పట్టణంలోని ఒకటో గేటు ద్వారా బస్టాండ్ వైపు వెళ్లాలని సూచించారు.
ఇదీ చదవండి: శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు