వైకాపా ప్రభుత్వం 100 రోజుల పాలనపై జనసేన పార్టీ ఓ నివేదికను సిద్ధం చేసింది. ప్రభుత్వ పరిపాలనా విధానంపై రూపొందించిన నివేదికలో మూల అంశాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు ప్రజల ముందుంచనున్నారు. కొత్త ప్రభుత్వం తీరు తెన్నులపై 100 రోజుల పాటు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదని పార్టీ శ్రేణులను పవన్ గతంలో ఆదేశించారు. ఆ గడువు ముగియటంతో ఇప్పుడు వైకాపా పాలనపై గళం విప్పనున్నారు.
ముఖ్య శాఖల పనితీరుపై అధ్యయనం
ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖల పనితీరుని అధ్యయనం చేసేందుకు పార్టీలోని సీనియర్ నేతలు, నిపుణులతో కూడిన పది బృందాలను ఇప్పటికే పవన్ నియమించారు. వారంతా తమ అధ్యయనాలను పూర్తి చేసి నివేదికను జనసేన అధినేతకు అందించారు. ఆయా నివేదికల్లోని ముఖ్యాంశాలను ప్రజలకు జనసేనాని నేడు వివరించనున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు పవన్ కల్యాణ్ నివేదికను విడుదల చేయనున్నారు.