గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని అంగలకుదురు గ్రామంలో ఒకే కుటుంబంలో రోజుల వ్యవధిలో కరోనా కాటు వేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి బారిన పడి కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో చుట్టు పక్కల గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.
తెనాలి విద్యుత్ విభాగంలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి తండ్రికి(70)కి తొలుత కరోనా సోకింది. చికిత్స అనంతరం కోలుకుని క్షేమంగా ఇంటికి వచ్చాడు. అదే క్రమంలో కాంట్రాక్టర్‌కు, అతని తల్లితో పాటు, అతని సతీమణికి (45) కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో వీరంతా హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లారు. చికిత్స పొందుతూ అతని తల్లి ఈ నెల పదో తేదీన మృతి చెందారు. అటుపై విజయవాడలో చికిత్స పొందుతూ.. అతని భార్య ఈనెల 19వ తేదీన ప్రాణాలు కోల్పోగా.. ఆదివారం ఆ వ్యక్తి కూడా తుది శ్వాస విడిచారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఆందోళనలో విద్యుత్ ఉద్యోగులు..
తాజా ఘటన నేపథ్యంలో తెనాలి డివిజన్ పరిధిలోని విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. డివిజన్ మొత్తం మీద ఇటీవల కాలంలో దాదాపుగా 20 మంది కొవిడ్ బారిన పడ్డారని విద్యుత్ విభాగంలో ఓ ఉద్యోగి తెలిపారు. వీరిలో కొంతమంది వైరస్ నుంచి కోలుకోగా.. మరికొందరు చికిత్స పొందుతున్నారని ఆ ఉద్యోగి వివరించారు.
ఇదీ చదవండి:
'కరోనా పరీక్షకు ఫీజు రూ. 499.. ఎక్కువ తీసుకుంటే ల్యాబ్‌ల రిజిస్ట్రేషన్ రద్దు'