Thief suspicious death: బంగారం చోరీ కేసులో నిందితుడు అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన.. ఏలూరు జిల్లా కేంద్రంలో ఈ నెల 7వ తేదీ రాత్రి చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ బంగారు దుకాణంలో రూ.19లక్షల విలువైన బంగారు తీగ చోరీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు వూదా నరేంద్రను.. పోలీసులు విశాఖలో పట్టుకున్నారు. అక్కడినుంచి మంగళగిరి తరలిస్తుండగా ఈ ఘటన జరగటంతో మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నయి.
పాతమంగళగిరికి చెందిన బంగారు వస్తువులు తయారుచేసే వ్యాపారి కొల్లి గిరి తన వద్ద ఉన్న 350గ్రాముల బరువున్న సుమారు రూ.19లక్షలు విలువచేసే బంగారు తీగ చోరీకి గురైందని ఈ నెల 5న మంగళగిరి అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నరేంద్ర కోసం గాలింపు చేపట్టారు. అతను నివాసం ఉండే మంగళగిరిలోని దేవుడి మాన్యంగా పిలిచే ప్రాంతంలో ఆరా తీయగా.. ఫిర్యాదు అందిన నాటి నుంచి అతను కనిపించకుండా పోయినట్లు తెలిసింది.
దర్యాప్తులో విశాఖపట్నంలో ఉన్నట్లు సమాచారం అందడంతో మంగళగిరి అర్బన్ ఎస్సై మహేంద్ర సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. తిరిగి వస్తుండగా 7వ తేదీ సాయంత్రం ఏలూరుకు 5కిలోమీటర్ల దూరంలోని దెందులూరు చెక్‌పోస్టు వద్ద నరేంద్ర అస్వస్థతకు గురయ్యారు. అతన్ని చికిత్స కోసం సమీపంలోని ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు నరేంద్ర మృతిచెందినట్లు నిర్థరించారు. దీనిపై ఎస్సై మహేంద్ర ఏలూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అదేరోజు రాత్రి మంగళగిరిలో ఉన్న నిందితుడి కుటుంబసభ్యులను పోలీసులు ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రి వద్దకు పిలిపించారు. ఫిట్స్‌తో అస్వస్థతకు గురై నరేంద్ర మృతిచెందినట్లు పోలీసులు చెబుతుండగా, అతనికి అంతకుముందు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని కుటుంబసభ్యులు చెబుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో.. ఏదైనా జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: అటు ధరల పతనం... ఇటు విద్యుత్ కోతలు... బెల్లం పరిశ్రమల ఆవేదన