గుంటూరు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న తన భర్త కనిపించటం లేదని భార్య రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. మున్సిపాలిటీ ఆర్ఐగా పనిచేస్తున్న గొబ్బూరి వెంకటేశ్వర్లు ఈనెల 7వ తేదీన ఆఫీసు పనిమీద విజయవాడ వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. అదేరోజు రాత్రి 9గంటలకు తమ చిన్న కుమార్తెకు ఫోన్ చేసి ఆఫీసు పని పూర్తి కాలేదని మరుసటి రోజు వస్తానని చెప్పాడు. 8వ తేదీన తాము ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందన్నారు. ఆరోజు విజయవాడ వెళ్లి వెతికామని అతని ఆచూకీ దొరకకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చామని పేర్కొన్నారు.
తొమ్మిదవ తేదీన మళ్లీ ఫోన్ చేయగా ఫోన్ రింగ్ అయ్యిందని.. కానీ ఎవరో ఒక వ్యక్తి ఫోన్ ఎత్తి.. వెంకటేశ్వర్లు ఫోన్‌ను తమ షాపులో ఛార్జింగ్ పెట్టి వెళ్లాడని చెప్పారన్నారు. అది ఏ ఊరని వాకబు చేయగా.. పెనుగంచిప్రోలు అని చెప్పాడన్నారు. 10న కూడా ఫోన్ చేయగా రింగ్ అయ్యిందని.. కానీ లిఫ్ట్ చేయలేదన్నారు. అతను పనిచేసే కార్యాలయానికి వెళ్లి అడిగితే ఆఫీసు పని మీద వెళ్లాడని.. తర్వాత తమకు కాంటాక్ట్‌లో లేడని అధికారులు తెలిపారని చెప్పారు. బంధువుల ఇళ్ల వద్ద కూడా వెతికామని.. ప్రయోజనం లేదన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని అర్బన్ ఎస్సై నరసదాసు తెలిపారు.
ఇదీ చదవండి: 'పోలీసులు అన్యాయంగా నా భర్తను అదుపులోకి తీసుకున్నారు'