గుంటూరు జిల్లా మాచర్ల పురపాలక సంఘం వైకాపాకు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పురపాలికలోని 31 వార్డుల్లోనూ వైకాపాకు సంబందించిన అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. మూడు రోజులుగా నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్నా... ప్రతిపక్ష తెదేపా, జనసేన, భాజపాల నుంచి ఎవరూ నామినేషన్ వేసేందుకు ముందుకు రాలేదు. కనీసం స్వతంత్రులు కూడా పోటీ చేయటం లేదు. అయితే నామినేషన్ల ప్రక్రియ మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా... తెదేపా అభ్యర్థులమంటూ ఐదుగురు నామినేషన్లు వేశారు. వారు కేవలం నామపత్రాలు మాత్రమే అధికారులకు అందజేశారు. నామపత్రాలతో పాటు జతచేయాల్సిన నగదు డిపాజిట్, ఎన్వోసీ, తెదేపా బీఫాం ఏవీ లేవు. తెదేపా నేతలు వారితో వ్యూహాత్మకంగా నామినేషన్ వేయించినట్లు తెలుస్తోంది.
మాచర్లలో వైకాపా నేతల సందడి
పురపాలక సంఘం కార్యాలయం వద్ద వైకాపా అభ్యర్థుల సందడి నెలకొంది. నియోజకవర్గంలోని 71 స్థానాల్లో 66 చోట్ల కేవలం వైకాపా అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే పోటీ ఉంది. మున్సిపాలిటీలో కనీసం ఒక్కచోట కూడా పోటీ లేకపోవటం అధికార పార్టీ బెదిరింపులకు నిదర్శనంగా తెదేపా నేతలు చెబుతున్నారు. నామినేషన్ వేసేందుకు సిద్ధపడిన వారిని బెదిరిస్తున్నారని.. పోలీసు కేసులు పెడతామని భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో... ఎవరూ నామినేషన్ వేయటానికి ముందుకు రాలేదని మాచర్ల తెదేపా ఇంఛార్జీ చలమారెడ్డి ఆరోపించారు.
ఇవీ చదవండి:
డోన్‌లో మున్సిపల్ ఎన్నికలు బహిష్కరిస్తున్నాం: కేఈ కృష్ణమూర్తి