వివిధ శాఖల నుంచి ఆర్థికశాఖ అందుకున్న బిల్లుల వివరాలను తమ ముందు ఉంచాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. సీల్డ్ కవర్లో ఆ వివరాలను సింగిల్ జడ్జి వద్ద ఉంచాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం తేల్చేందుకు ఆ వివరాలు ఏవిధంగా అవసరమో పేర్కొంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వులిస్తారని తెలిపింది. వివరాలు ఇవ్వడంపై అభ్యంతరం ఏమిటో సింగిల్ జడ్జి వద్దే వాదనలు వినిపించాలంది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ దాఖలుచేసిన లెటర్ పేటెంట్ అప్పీల్(ఎల్‌పీఏ)ను కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు, జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
సీపీడబ్ల్యూఎస్ కింద చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ గుంటూరుకు చెందిన శివప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. బిల్లులు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించినా అధికారులు అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. విచారణకు హాజరైన ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి.. ప్రాధాన్య క్రమంలో సీఎఫ్‌ఎంఎస్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. మొదట వచ్చిన బిల్లులను మొదటే ఎందుకు చెల్లించడం లేదని న్యాయమూర్తి(సింగిల్ జడ్జి బెంచ్) అసహనం వ్యక్తం చేశారు. గత ఏడాది ఆర్థికశాఖకు వచ్చిన బిల్లుల వివరాలను అఫిడవిట్ రూపంలో తన ముందు ఉంచాలని ఆదేశించారు. ఈ ఆదేశాలపై ఎస్‌ఎస్ రావత్ ధర్మాసనం ముందు ఎల్‌పీఏ వేశారు. న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కోర్టు ధిక్కార వ్యాజ్య పరిధి దాటి సింగిల్ జడ్జి ఆర్థిక వివరాలను కోరారన్నారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేయాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ ఎల్‌పీఏకు విచారణ అర్హత లేదంది. దానిని కొట్టేసింది. సీల్డ్ కవర్లో సింగిల్ జడ్జి కోరిన వివరాలను ఇవ్వాలంది.
* మరోవైపు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ వద్ద ఇదే వ్యవహారంపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చింది. ప్రభుత్వం కౌంటర్ వేసేందుకు విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.
ఇదీ చదవండి: 'ఏబీవీ కేసు దర్యాప్తు వివరాలు సమర్పించండి'.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం