R5 zone plots : "నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు" కార్యక్రమంలో భాగంగా విజయవాడ, పెదకాకాని, దుగ్గిరాల ప్రాంతాలకు చెందిన 50వేల మందికి... రాజధాని అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తూ, రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేస్తూ... ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, నిడమర్రు పరిధిలో ఆర్ 5 పేరుతో కొత్త రెసిడెన్షియల్ జోన్ ఏర్పాటు చేసింది. ఇళ్ల స్థలాల కోసం ఎన్టీఆర్ జిల్లాకు 584 ఎకరాలు, గుంటూరు జిల్లాకు 550 ఎకరాలు కలిపి... మొత్తంగా 1134 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించింది.
ఆమేరకు ఎన్టీఆర్ జిల్లాకు చెందినవారి కోసం 11, గుంటూరు జిల్లాకు చెందినవారి కోసం 10 లేఅవుట్‌లను సిద్ధం చేస్తున్నారు. ఆ పనులు జరుగుతుండగానే... రెండు జిల్లాల కలెక్టర్ల విజ్ఞప్తితో మరో 268 ఎకరాలు కేటాయించాలని "ల్యాండ్ ఎలాట్‌మెంట్ స్క్రూటినీ కమిటీ" నిర్ణయించింది. ప్రభుత్వం కేటాయించిన 584 ఎకరాల్లో 20,684 మంది లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వగలమని, మిగతా 6055 మంది కోసం మరో 168 ఎకరాలు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కోరినట్లు... పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మికి రాసిన లేఖలో సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు.
అలాగే 550 ఎకరాల్లో 19,818 మందికి స్థలాలు ఇవ్వగలమని, మిగతా 3,417 మందికి కోసం మరో 100 ఎకరాలు కేటాయించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కోరినట్లు చెప్పారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో 3 జోన్‌లో... బోరుపాలెం, పిచ్చికపాలెం, అనంతవరం గ్రామాల పరిధిలో ఎన్టీఆర్ జిల్లా వారికి, నెక్కల్లు గ్రామ పరిధిలో గుంటూరు జిల్లా వారికి భూములు కేటాయించాలని కోరారు. ఎకరాకు 24.60 లక్షల చొప్పన సీఆర్డీఏకి చెల్లించేలా భూములు కేటాయించాలన్నారు.
కలెక్టర్ల లేఖలు.. అదనపు భూములు కేటాయించాలంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఏప్రిల్ 26న, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏప్రిల్ 27న లేఖలు రాశారు. అందుకు బదులుగా రెండు జిల్లాల కలెక్టర్లకు సీఆర్డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్ సోమవారం లేఖలు రాశారు. ఆయన రాసిన లేఖల్ని బట్టి చూస్తే.. 3,535 మంది లబ్ధిదారుల కోసం అదనంగా 98 ఎకరాలు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కోరగా, వెయ్యి మంది లబ్ధిదారుల కోసం 30 ఎకరాలు కేటాయించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కోరినట్లు ఉంది. అయితే, 50 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున... ఆ సంఖ్యను చేరుకునేలా అదనపు లబ్ధిదారుల్ని గుర్తించమంటూ కలెక్టర్లకు రాసిన లేఖలో వివేక్‌యాదవ్ సూచించారు.
దీన్ని అత్యవసరంగా పరిగణించి లబ్ధిదారుల వివరాలు అందజేయాలని కోరారు. జిల్లా కలెక్టర్లకు సోమవారం వివేక్ యాదవ్ లేఖ రాయగా, ల్యాండ్ అలాట్‌మెంట్ కమిటీ మంగళవారం సమావేశమై... 268 ఎకరాలు అదనంగా కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇక రాజధాని అమరావతిలో సగటున ఎకరం బేస్ ప్రైస్ 4.1 కోట్ల రూపాయలుగా నిర్ధారించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల గృహ నిర్మాణానికి... బేస్‌ప్రైస్‌లో 25 శాతానికి కేటాయించవచ్చన్న నిబంధన ఉంది. కానీ, 6 శాతానికి ఎకరానికి 24.60 లక్షల చొప్పున 268 ఎకరాలకు కలిపి 65.93 కోట్ల రూపాయలు రెవెన్యూశాఖ చెల్లించాలని... పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో సీఆర్డీఏ కమిషనర్ పేర్కొన్నారు.
మండిపడుతున్న రైతులు.. అమరావతిలో ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం అదనంగా 268 ఎకరాలు కేటాయించడంపై రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం కోర్టుల పరిధిలో ఉన్నా... ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. రాజధాని భూములను ఇష్టానుసారం పంచుకుంటూ పోతే కీలక నిర్మాణాలకు స్థలం ఎలా వస్తుందని అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల రాజధాని మాస్టర్‌ప్లాన్ సర్వనాశనం అవుతుందని... అమరావతిని నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం సెంటు భూమి చొప్పున కేటాయిస్తోందని రాజధాని రైతు జేఏసీ నేత పువ్వాడ సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి :