Government Diverted Finance Commission Funds: డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త, శుభ్రం చేయని రహదారులు, పాచిపట్టిపోయిన తాగునీటి ట్యాంకులు.. ఇదీ రాష్ట్రంలోని చాలా గ్రామాల పరిస్థితి. పంచాయతీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటంతో, ఎక్కడా అభివృద్ధి చేసేందుకు వీలుండటం లేదు. దీంతో సర్పంచులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని.. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారు ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలోనూ విద్యుత్ బిల్లుల బకాయిల పేరిట నిధులు లాగేసుకున్నారు. వాటికి రసీదులు కూడా ఇవ్వడం లేదు. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం నిధులు రాబోతున్నాయి. వాటిని కూడా పంచాయతీ ఖాతాల్లో కాకుండా పీడీ ఖాతాల్లోకి మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలపై సర్పంచులు మండిపడుతున్నారు.
"తాగునీటి నుంచి మొదలుకొని వీధి లైట్ల వరకు ప్రతిదీ గ్రామస్థులు మమ్మల్ని అడుగుతారు. ఒక్క రూపాయి కూడా ఖాతాల్లో లేనప్పుడు సర్పంచులు ఏలా పని చేస్తారు. గ్రామల్లో శానిటైజేషన్ పనులు, నిర్వహణ, గ్రీన్ అంబాసిడర్ల జీతాలు లేకుండా అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్లగాలము." -ప్రీతి, కొలకలూరు గ్రామసర్పంచ్
"శానిటైజేషన్, డ్రైనేజీ కాల్వలు, తాగునీటి వసతులు ఇలా ఏదైనా సరే, గ్రామానికి మంచి చేయాలనే దృక్పథంతో వచ్చాము. అలా చేసే అవకాశం మాకు కల్పించలేదు. రోడ్లు వేయలేదని, డ్రైనేజీలు కట్టించలేదని గ్రామస్థులు అడుగుతున్నారు. వారికి సమాధానం చేప్పలేని పరిస్థితిలో ఉన్నాము". -జానకిదేవి, గొడవర్ర గ్రామసర్పంచ్
పంచాయతీలు సెప్టెంబరు 10లోగా విద్యుత్తు బకాయిలు చెల్లించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్దేశిత గడువులోపు చెల్లిస్తే సర్‌ఛార్జీ ఎత్తివేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. పల్లెల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. మురుగుకాలువల్లో పూడిక పేరుకుపోయి మురుగు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రహదారులు గుంతలు పడటంతో వర్షాలు పడినప్పుడు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ పనీ చేయలేనప్పుడు తాము సర్పంచులుగా ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
"ముఖ్యమంత్రికి ఏపీ ప్రజలపైన ఎంత బాధ్యత ఉందో.. మాకు మా గ్రామ ప్రజలపైన అంతే బాధ్యత ఉంది. మేము బాధ్యతగా పని చేయాల్సిన అవసరం ఉంది. మాకు వచ్చే నిధులను తరలించకుండా, సమస్యలకు దారి చూపించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాము". -శిరీష, జొన్నలగడ్డ గ్రామసర్పంచ్
"రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా నిధులను పీడీ ఖాతాల్లోకి మళ్లీంచి.. ఆ నగదును విద్యుత్తు బిల్లుల పేరుతో తీసుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిని సర్పంచ్ సంఘం తరపున ఖండిస్తున్నాం. గ్రామాల్లో సర్పంచులు మొహం చూపించుకునే పరిస్థితి లేదు. అభివృద్ధి పనులు చేయకపోవటం వల్ల జనాలకు భయపడి తిరగాల్సి వస్తోంది". -పాపారావు, గుంటూరు సర్పంచుల సంఘం అధ్యక్షుడు
ఇవీ చూడండి: