Sand Price Unchanged For A Year And A Half : ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక వ్యాపారాన్ని జేపీ పవర్ వెంచర్స్ పేరిట సబ్ కాంట్రాక్టరు టర్న్‌కీ సంస్థ నిర్వహిస్తున్నట్లు బయటకు చెబుతున్నారు. వాస్తవంగా ప్రతీ జిల్లాలో అధికారపార్టీకి చెందిన సిండికేట్ల ఆధ్వర్యంలో రీచ్‌ల వారీగా స్థానిక నేతలే తవ్వకాలు, విక్రయాలు చేస్తున్నారు. అయితే నియోజకవర్గాల వారీగా ఇసుక ధరలు వేర్వేరుగా ఉన్నాయి. రీచ్‌లో టన్ను ధర 475 అని, నియోజకవర్గాల వారీగా రవాణా ఖర్చులతో కలిపి ఇసుక డిపోల్లో విక్రయధర ఎంతో పేర్కొంటూ గనులశాఖ ప్రతీ ఆదివారం పత్రికా ప్రకటనలు ఇస్తోంది.
వాటిలో ధరలకు స్థానికంగా ఉండే ధరకు పొంతనలేదు. ఎందుకీ వ్యత్యాసమంటే అధికారులు బదులివ్వరు. ఏపీలో 2021లో నదుల్లో వరద ప్రవాహం కారణంగా నెలల తరబడి ఇసుక తవ్వకాలకు ఆటంకం కలిగింది. దీంతో దూర ప్రాంతాలు, పొరుగు జిల్లాల్లో రీచ్‌లు కేటాయించి అక్కడి నుంచి ఇసుక తవ్వి తెచ్చి డిపోల్లో నిల్వ చేశారు. ఆ రవాణా ఖర్చులను లెక్కించి ఏయే నియోజకవర్గాల్లో ఎంత ధరకు టన్ను ఇసుక విక్రయించాలో అధికారికంగా ఖరారుచేశారు. మళ్లీ అక్కడి నుంచి వినియోగదారుడు ఇసుకతీసుకెళ్లేందుకు రవాణా ఖర్చులు వెచ్చించాలి. ఇదంతా జరిగి ఏడాదిన్నర దాటిపోయింది. కొంతకాలంగా నదుల్లో వరదలు లేవు. ఎక్కడికక్కడే ఇసుక తవ్వకాలు విక్రయాలు జరుగుతున్నాయి. కానీ గనులశాఖ మాత్రం సంవత్సరంన్నర కిందటి ధరలనే ఇంకా పేర్కొంటోంది.
గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు గుంటూరు నగరంలోనే కలిసి ఉంటాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో అధికారిక ఇసుక ధరలో తేడా టన్నుకు 240 రూపాయలుగా ఉంది. తూర్పు నియోజకవర్గంలో టన్ను 680 రూపాయలు ఉంటే పశ్చిమలో920 ఉంది. ఇంత తేడా ఏంటని ఆశ్చర్యపోతున్నారా? గనులశాఖ లెక్కలు అలాగే ఉంటాయి. ఇంకా విచిత్రం ఏమంటే ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఇసుక నిల్వకేంద్రాలు పనిచేయడం లేదు.
విజయవాడ పరిధిలోని తూర్పు నియోజకవర్గంలో టన్ను ఇసుక ధర 725 రూపాయలు ఉంటే మధ్య, పశ్చిమ నియోజకవర్గాల్లో టన్ను645 మాత్రమే. తూర్పు నియోజకవర్గానికి కానూరు పరిధిలో మధ్య, పశ్చిమ నియోజకవర్గాలకు భవానీపురం సోమా మైదానం వద్ద నిల్వ కేంద్రాల్లో ఇసుక ఉండాలి. కానీ ఎక్కడా నిల్వలు లేవు. మధ్యవర్తులు, లారీ యజమానుల ద్వారా వేరువేరు రీచ్‌ల నుంచి నగరవాసులు ఇసుకను తెప్పించుకుంటున్నారు.
గుంటూరు తూర్పులో టన్ను 680, పశ్చిమలో 920గా గనులశాఖ అధికార ధర ఉంటే నగరవాసులు వైకుంఠపురం, అమరావతి రీచ్‌ల నుంచి ఇసుక తెప్పించుకుంటున్నారు. రవాణా ఛార్జీలతో కలిపి టన్నుకు 700-800 ఖర్చవుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో టన్ను ఇసుక ధర 880గా పేర్కొంటున్నారు. ఈ నియోజకవర్గంలోని రావులపాలేనికి గతంలో రాజమహేంద్రవరం అవతల 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతానగరం నుంచి ఇసుక తెచ్చి నిల్వ చేసి విక్రయించారు. కాబట్టి అప్పట్లో టన్ను 880గా నిర్ణయించారు. ఇపుడు రావులపాలెం చుట్టూ.. అయిదారు కిలోమీటర్ల దూరంలో పలు రీచ్‌లలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. టన్ను 600-650కి లభిస్తోంది. కానీ గనులశాఖ ధర టన్ను880గానే ఉంది. కొత్తపేటకు నాలుగైదు కి.మీ. దూరంలోని మందపల్లి రీచ్‌లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అయినా కొత్తపేటలో టన్ను ఇసుక ధర 880గా గనులశాఖ పేర్కొంటోంది.
ప్రభుత్వ ప్రకటనలో 175 నియోజకవర్గాల్లో ఇసుక అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. కానీ చాలా డిపోల్లో ఇసుక జాడే లేదు. గతంలో ఇసుక వ్యాపారం చేసిన ప్రధాన గుత్తేదారు జేపీ సంస్థ, ఉపగుత్తేదారు టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్ దాదాపు అన్నినియోజకవర్గాల్లో ఇసుక డిపోలు ఏర్పాటుచేసి విక్రయాలు చేశాయి. ప్రస్తుతం నెలల తరబడి డిపోలు తెరుచుకోలేదు. అయినా గనులశాఖ మాత్రం ప్రతివారం అన్నిచోట్లా ఇసుక లభిస్తున్నట్లే అక్కడి ధరలతో ప్రకటనలు ఇస్తోంది. అనకాపల్లి, విశాఖ జిల్లాలకు శ్రీకాకుళం, రాజమహేంద్రవరం జిల్లాల నుంచి ఇసుక తెప్పించి డిపోల్లో అమ్మేవారు. ఇపుడు పలు డిపోలు మూతపడ్డాయి. అనకాపల్లి జిల్లా మాడుగుల, చోడవరం డిపోలు గత సంవత్సరం నుంచి తెరుచుకోలేదు.
గత సంవత్సరం ఆగస్టులో జేపీ సంస్థ నుంచి నేతలు ఇసుక వ్యాపారం చేజిక్కించుకున్నాక చోడవరం డిపోలో వారం పాటు ఇసుక విక్రయించారు. తర్వాత మళ్లీ మూసేశారు. కానీ ప్రతి ఆదివారం చోడవరం నియోజకవర్గంలో ఇసుక టన్ను1,400కి లభ్యమవుతున్నట్లు ప్రకటనలో ఉంటోంది. నెల్లూరు జిల్లా కందుకూరు డిపో ఏడెనిమిది నెలలుగా మూతపడింది. ఒక వ్యక్తి నెల్లూరు నుంచి లారీల్లో ఇసుక తెప్పించి దానిని ట్రాక్టర్లలో నింపి స్థానికంగా విక్రయిస్తున్నారు.
ఇవీ చదవండి