తొలి ప్రయత్నం.. అందునా 22 సంవత్సరాల వయసులోనే సివిల్స్‌లో విజయం సాధించారు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దోనేపూడి విజయ్‌బాబు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ఆయనకు 682వ ర్యాంకు వచ్చింది. తండ్రి దోనేపూడి మధుబాబు జీఎస్టీ విజయవాడ సూపరింటెండెంట్ కాగా, తల్లి రాజ్యలక్ష్మి గృహిణి. కవల సోదరుడు, అన్న అయిన అజయ్‌బాబు కూడా సివిల్స్‌కు సాధన చేస్తున్నారు. విజయ్‌బాబు పదో తరగతి వరకు తెనాలిలోని సెయింట్ జాన్స్ స్కూల్‌లో, ఇంటర్‌ను వివేక జూనియర్ కళాశాలలో చదివారు. దిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో బీఏ చదివి, 2019లో పట్టా అందుకున్నారు. 2020లో సివిల్స్ రాసి ర్యాంకు పొందారు.
‘నువ్వు సివిల్స్ సాధించాలని అమ్మానాన్న నాకు లక్ష్యాన్ని ఏర్పరిచారు. మార్గాన్ని కూడా వారే చూపించారు. వారితో పాటు అన్నయ్య కూడా నన్ను నిరంతరం ప్రోత్సహించారు. ఈ విజయం వెనుక ప్రధానంగా ఉన్నది ఈ ముగ్గురే’ అని విజయ్‌బాబు చెప్పారు. తండ్రి, గురువులు, స్నేహితులు, పెద్దల సూచనలు తీసుకుంటూ తాను సొంతంగానే సాధన చేశానని, ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకున్నానని చెప్పారు. ఎక్కవ మెటీరియల్ తీసుకుని మొత్తం చదవలేక ఇబ్బంది పడేకంటే నాణ్యమైన తక్కువ మెటీరియల్‌ను తీసుకుని, దాన్ని మొత్తం చదివానని, ఐఆర్‌ఎస్ వస్తుందని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
జాతీయ స్థాయిలో తమ కొడుకు మంచి ర్యాంకు సాధించాడని ఒకవైపు ఆనందంగా ఉన్నా.. కోరుకున్న ర్యాంకు రాలేదని మళ్లీ ఆ దిశగా ప్రయత్నం చేయడానికి ప్రోత్సహిస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: నేడు జెడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక.. వెంటనే ప్రమాణస్వీకారం!