గుంటూరు జిల్లా తెనాలిలో హత్యకు గురైన షేక్ సుభాని కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు షేక్‌రఫీ, షేక్బాజీలను తెనాలి మార్కెట్లో అరెస్ట్ చేసినట్లు సీఐ బత్తుల శ్రీనివాసరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెనాలి పట్టణంలోని నందులపేటకు చెందిన సుభానీ, రఫీ మిత్రులు. గత ఏడాది రఫీ వద్ద సుభానీ రూ.15 వేలు అప్పుగా తీసుకున్నారు. దానిని ముందుగా చెప్పిన సమయానికి చెల్లించలేకపోయారు. దాంతో సుభానీ ద్విచక్ర వాహనాన్ని లాక్కున్న రఫీ దాన్ని తాకట్టు పెట్టుకున్నాడు. ఈ విషయంపై ఇరువురి నడుమ వాగ్వాదాలు జరిగాయి. సుభానీ తనను దుర్భాషలాడడంతో అతన్ని చంపాలని నిశ్చయించుకున్న రఫీ.. ఈ నెల 23న ‘మన మధ్య తగాదాలు వద్ధు. నీ బండి నీకు ఇచ్చేస్తా’నంటూ అతన్ని నందులపేటలోని ఓ బార్‌కు పిలిపించాడు. అక్కడ తన మిత్రుడైన బాజీతో కలిసి సుభానీకి మద్యం తాగించి, తర్వాత గొడవ పెట్టుకున్నాడు. ఆ క్రమంలో అతన్ని క్రూరంగా కత్తితో నరికి చంపాడు. దీనిపై సీఐ మాట్లాడుతూ తొలుత రఫీ మద్యం తాగకుండా బార్‌లో అటూ ఇటూ తిరుగుతుండడంతో ‘రా అన్నా.. మందు తాగు’ అంటూ పలుమార్లు సుభానీ అతన్ని పిలిచినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని, రఫీ మనసులో ఏ ముందో తెలియని ఆయన అమాయకంగా ఇలా మద్యం తాగడానికి పిలిచారన్నారు. హత్య చేసిన రఫీ, అతనికి సహకరించిన బాజీలను అరెస్టుచేశామని, వారిని న్యాయస్థానంలో ప్రవేశపెడతామని సీఐ వివరించారు. ఈ సమావేశంలో ఎస్సైలు మహమ్మద్ రఫీ, ఎం.రాంబాబు పాల్గొన్నారు.
ఇదీచదవండి