Chandrababu letter to DGP : కర్నూలు జిల్లా కోసిగి మండలం పెద్దభూంపల్లిలో తెదేపా నేత తిక్కారెడ్డిపై దాడి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. తిక్కారెడ్డికి భద్రత కల్పించాలన్నారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. 'గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లిన తిక్కారెడ్డిపై... వైకాపా గూండాలు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు. గతంలో తిక్కారెడ్డిపై అధికార పార్టీకి చెందినవారు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వైకాపా వారి నుంచి ఆయనకు ప్రాణ హాని, ఆస్తులకు ముప్పు ఉన్నా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది. ఇప్పటికైనా బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయనకు భద్రత కల్పించాలి' అని చంద్రబాబు కోరారు.
రాష్ట్రంలో వైకాపా మూకలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలం అవుతున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు కుప్పకూలి శిథిలావస్థకు చేరుకున్నాయని ఆక్షేపించారు. నేరస్థులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారు నేరాలకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
వైకాపా ప్రోద్బలంతోనే..
తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా శాంతియుత ప్రదర్శనకారులపై హింసాత్మక దాడులకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. వైకాపా ప్రోద్బలంతోనే తెదేపా నేతలు, క్యాడర్, సానుభూతిపరులుపై అసాంఘిక శక్తులు దాడులకు తెగబడుతున్నారన్నారు. గతంలో 2020 ఫిబ్రవరిలో తిక్కారెడ్డిపై వైకాపా గూండాలు చేసిన దాడిలో తిక్కారెడ్డి తీవ్రంగా గాయపడ్డారని, తిక్కారెడ్డికి అధికార పార్టీ నుంచి ప్రాణహాని, ఆయన ఆస్తులకు ముప్పు ఉన్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విస్మయం కలిగిస్తోందన్నారు. తిక్కారెడ్డిపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఏం జరిగింది?
Attack on thikka reddy: జిల్లాలోని కోసిగి మండలం పెద్దభూంపల్లిలో ఇటీవల జరిగిన ఆంజనేయస్వామి రథోత్సవంలో తిక్కారెడ్డి పాల్గొన్నారు. ఇదే అదునుగా భావించిన వైకాపా అల్లరి మూకలు దాడులకు తెగబడ్డారు. కర్రలతో ఒక్కసారిగా వైకాపా నాయకులు విరుచుపడ్డారు. వెంటనే తేరుకున్న తెదేపా కార్యకర్తలు తిక్కారెడ్డిని కాపాడారు. ఈ ఘటనలో ఐదుగురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇద్దరిని చికిత్స కోసం ఆదోని ఆస్పత్రికి తరలించారు. బాధితులను మంత్రాలయం తెదేపా బాధ్యుడు తిక్కారెడ్డితో పాటు ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, తెెదేపా నాయకులు పరామర్శించారు. కాగా.. చికిత్స కోసం వెళ్తున్న నలుగురిని పోలీసులు అడ్డుకున్నారని, ఆదోనికి రాకుండా నిలువరించారని బాధితుడు నరసప్ప చెప్పారు. తమ ప్రాణాలకు ఎటువంటి హాని జరిగినా ముఖ్యమంత్రి జగన్‌దే బాధ్యత అని తిక్కారెడ్డి అన్నారు.
వైకాపా అరాచకానికి నిదర్శనం: అచ్చెన్నాయుడు
Achennayudu respond On attack: మంత్రాలయం తెదేపా నేత తిక్కారెడ్డిపై హత్యాయత్నం వైకాపా అల్లరి మూకల బరితెగింపునకు నిదర్శనమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అమ్మవారి జాతరకు వెళ్తే హత్యాయత్నం చేస్తారా? అని నిలదీశారు. వరుసగా రెండుసార్లు హత్యాయత్నం జరిగినా భద్రత కల్పించకపోవడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. తిక్కారెడ్డి ప్రాణాలకు ఎటువంటి హాని జరిగినా ముఖ్యమంత్రి జగన్‌దే బాధ్యతని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ రాకతోనే రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోసుకున్నాయన్నారు. అరాచక దాడులతో తమ నిజస్వరూపాన్ని చాటుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలతో ఎంతోకాలం పాలన సాగించలేరని ముఖ్యమంత్రి జగన్ గ్రహించాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే వైకాపా అరాచకాలను అడ్డుకుంటామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: నారా లోకేశ్
Nara lokesh on attack: మంత్రాలయం తెదేపా నేత తిక్కారెడ్డిపై హత్యాయత్నాన్ని నారా లోకేశ్ ఖండించారు. తిక్కారెడ్డిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తిక్కారెడ్డిపై గతంలో హత్యాయత్నం జరిగినా భద్రత కల్పించలేదని లోకేశ్ విమర్శించారు. వైకాపా అరాచక పాలనకు ఈ దాడులే నిదర్శనమన్నారు.
ఇదీ చదవండి: Special Team for Cheddi gang: చెలరేగిపోతున్న చెడ్డీ గ్యాంగ్.. రంగంలోకి ప్రత్యేక బృందాలు