కరోనా దెబ్బకు విద్యా వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయి. ఆన్‌లైన్ తరగతులు అందుబాటులోకి రావటంతో విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి అవసరంగా మారింది. ఇదే సమయంలో ఆన్‌లైన్ గేమ్స్, యానిమేషన్, కార్టూన్లు చూడటం అలవాటైంది. దీంతో.. చదువులపై అసక్తి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో పిల్లలను ఆకట్టుకునేందుకు, వారికి నచ్చిన యానిమేషన్ వీడియోలతోనే పాఠాలు బోధిస్తున్నారు గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కుమారి. యూట్యూబ్ ఛానెల్ ద్వారా వినూత్న పాఠాలను విద్యార్థులకు చేరువ చేస్తున్నారు.
పిల్లలు వాస్తవ ప్రపంచంలో జీవించాలి. జంతువులు, పక్షులతో మమేకమవుతూ గడపాలి. అందుకే ప్రకృతికి సంబంధించిన వీడియోలు రూపొందించాను. యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించి అందులో నేను చేసే వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా ఈ వీడియోలు రూపొందిస్తున్నాను. - కుమారి, ఉపాధ్యాయురాలు
కార్పొరేట్ విద్యా సంస్థల్లోని డిజిటల్ తరగతుల్ని తలపించేలా బోధన సాగిస్తున్న కుమారి.. విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా ప్రత్యేక వీడియోలు రూపొందిస్తున్నారు. తన సొంత డబ్బుతో రకరకాల వస్తువులు, బోధనా సామగ్రి కొనుగోలు చేసి.. "గ్లోకల్ క్లాస్ రూమ్" అనే యూట్యూబ్ ఛానెల్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్ని ఆకట్టుకునే పాఠ్యాంశాల కోసం కుమారి.. ఉపాధ్యాయురాలిగానే కాక గాయని, నాట్యకారిణి, రచయిత, ఎడిటర్ వంటి బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. తోటి సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కుమారి. వ్యయ, ప్రయాసలకు వెరవకుండా విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్ అందించటమే లక్ష్యంగా.. కుమారి డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అందరి మన్ననలూ అందుకుంటున్నారు.
ఇదీ చదవండి: MINISTER AVANTHI : తాపీ మేస్త్రీ మృతి.. మంత్రి అవంతి ఇంటి ఎదుట ఆందోళన