Teachers in Election Duty Big Shock to CM Jagan: వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల విధుల్లో టీచర్లను నియమించాలని సీఈవో తెలిపింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులుగా పనిచేసేందుకు అర్హత గలవారి వివరాలను అన్ని ప్రభుత్వ శాఖల నుంచి భారత ఎన్నికల సంఘం సేకరిస్తోంది. అందులో భాగంగా ఉపాధ్యాయుల వివరాలనూ ఇవాళ్టిలోగా పంపాలని ఆదేశించింది. ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు అర్హత ఉన్న అధికారులు, సిబ్బంది వివరాలను పంపించాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.
జిల్లా పరిధిలో మొత్తం ఎంతమంది పోలింగ్ సిబ్బంది అవసరం.? ఎన్నికల విధుల నిర్వహణకు ఎంతమంది ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు.? గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మినహా మిగతా శాఖల సిబ్బంది ఎంతమంది ఉన్నారు.? గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మొత్తం ఎందరు ఉన్నారు.? అంశాలతో వివరాలు పంపించాలని కోరింది. ఈ సమాచారాన్ని సేకరించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈసీ(CEC)కి పంపనున్నారు.
రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాలు, వాటిలో అవసరమైన అధికారుల సంఖ్య, అందుబాటులో ఉన్నవారి సంఖ్య తదితర వివరాలు పరిశీలించాక ఏయే శాఖల ఉద్యోగులను నియమించాలో సీఈసీ(Central Election Commission) తుది నిర్ణయం తీసుకుంటుంది. ఉపాధ్యాయులకూ ఈ బాధ్యతలు ఇవ్వాలని సీఈసీ అనుకుంటే వారూ ఎన్నికల విధుల్లో భాగస్వాములవుతారు. ఇదే జరిగితే జగన్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది. అయితే సీఈసీ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం - పక్షపాతాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించం : సీఈసీ
ఉపాధ్యాయులు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచే ఎత్తుగడ వేసింది. విద్యా హక్కు చట్టానికి సవరణల పేరిట ఉపాధ్యాయులకు బోధన, విద్యా సంబంధిత అంశాలు తప్ప బోధనేతర విధులేవీ అప్పగించొద్దని గతేడాది నవంబరు 29న ఉత్తర్వులు జారీచేసింది. మరీ తప్పనిసరైతే అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులనూ పూర్తిగా వినియోగించుకున్నాకే ఉపాధ్యాయుల సేవలు వాడుకోవాలని పేర్కొంది.
ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుల భాగస్వామ్యం, పాత్ర లేకుండా చేసేందుకే ప్రభుత్వం ఉత్తర్వులు తెచ్చిందని, వారి స్థానంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని కేటాయించాలని భావించిందన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే బూత్ స్థాయి అధికారులుగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఉన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో పోలింగ్ అధికారులుగా పనిచేసేందుకు అర్హత ఉన్నవారి కోసం అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయుల సమాచారాన్నీ ఎన్నికల సంఘం( Election Commission) సేకరిస్తుండటంతో తర్వాత ఏం జరగనుందోననే చర్చ జరుగుతోంది.
అన్ని పార్టీల నుంచి ఫిర్యాదులు - ఈనెల 22న ఓటర్ల తుది జాబితా: ఈసీ