గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయ బదిలీ ఖాళీలకు సంబంధించి స్పష్టత వచ్చింది. ఈ ఖాళీలపై గత కొద్ది రోజుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం తుది జాబితాను జిల్లా విద్యాశాఖ రూపొందించింది. దాన్ని సోమవారం రాత్రి ఖరారు చేసింది. ఇదే వెబ్ ఆప్షన్లకు ప్రామాణిక జాబితాగా అధికారులు తెలిపారు. దీనిలో ఉన్న క్లియర్ వెకేన్సీల ఆధారంగానే ఉపాధ్యాయులు ఐచ్ఛికాలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సోమవారం రాత్రికి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉన్న ఖాళీలు కొలిక్కివచ్చాయి. క్లియర్ వెకెన్సీలు 313 తేలాయి. 5, 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అంతా కలిపి 469 మంది ఉన్నారు. మొత్తం ఖాళీలు 1067గా నిర్ధారించారు. గతంలో తయారుచేసిన జాబితాలో ప్రతి పాఠశాలలో పెద్దఎత్తున పోస్టులు బ్లాక్ చేశారనే విమర్శలు వచ్చాయి.
వాటిపై ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం వద్ద అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు సవరించిన మార్గదర్శకాల ఆధారంగా తిరిగి సీనియారిటీ జాబితా, పదోన్నతుల ఖాళీలు, క్లియర్ వెకేన్సీలు, బ్లాక్డు ఖాళీలు, హేతుబద్ధీకరణ ఖాళీలను తిరిగి తయారుచేసి తుది ఖాళీలను రూపొందించాయి. సోమవారం మధ్యాహ్నం వరకు వచ్చిన వినతులను సైతం పరిగణనలోకి తీసుకున్నారు. కొందరు ఉపాధ్యాయు స్పౌజ్(దంపతుల) కోటాలో ఈసారి తాము బదిలీలు కోరుకోవడం లేదని గతంలో దరఖాస్తు చేసుకున్నామని... అయితే ప్రస్తుతం అభిప్రాయం మార్చుకున్నామని మెయిల్ ద్వారా తమ వినతిని తెలియజేశారు. వాటన్నింటిని సవరించి తుది జాబితాకు రూపకల్పన చేసినట్లు అధికారులు వెల్లడించారు.
సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులకు సంబంధించిన తుది ఖాళీలను మంగళవారం ప్రకటిస్తారని తెలిసింది. ప్రస్తుతం యూపీ, ఉన్నత పాఠశాలలకు సంబంధించి తయారైన జాబితాను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు పంపనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: