వైకాపా నేతల అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. అధికారం అండతో సామాన్యులపై దాష్టీకాలకు పాల్పడుతున్నారు. తమ ఇంటికి వెళ్లే దారిని ఆక్రమించి వైకాపా సానుభూతిపరుడు గోడకట్టడంతో...తన గోడు సీఎం జగన్‌కు వినిపించేందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బిడ్డలతో కలిసి పాదయాత్ర చేపట్టింది. మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు బలవంతంగా ఆమెను తిరిగి వెనక్కి పంపించేశారు.
కన్నబిడ్డలతో వీల్‌ఛైర్‌లో పాదయాత్ర చేస్తున్న ఈమె ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాలు. వైకాపా సానుభూతిపరుడు తన ఇంటికి వెళ్లే దారిని ఆక్రమించి గోడకట్టాడని...ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి జగనే తనకు న్యాయం చేయాలంటూ కన్నబిడ్డలతో కలిసి ఆమె పాదయాత్ర చేప్టటింది. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంకు చెందిన గొట్టిపాటి సుధారాణి...ఈనెల 17న మేదరమెట్ట నుంచి పాదయాత్ర చేపట్టారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆమెను వీల్‌ఛైర్‌లో కూర్చోబెట్టుకుని ఇద్దరు కుమారులు, కుమార్తె కాలినడకన తాడేపల్లికి బయలుదేరారు. శనివారం సీఎం నివాసానికి సమీపంలోని కొలనుకొండ వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో వారు జాతీయరహదారిపైనే భైఠాయించి నిరసన తెలిపారు.
సోమవారం స్పందన కార్యక్రమంలో ఈ సమస్యను వివరించవచ్చని నచ్చజెప్పినా....సుధారాణి ససేమిరా అన్నారు. తాము మానసికంగా ఎంతో క్షోభ అనుభవిస్తున్నామని....ముఖ్యమంత్రి జగన్‌కు ఈ వివరాలన్నీ విన్నవించుకుంటామంటూ అక్కడే రహదారిపైనే భైఠాయించారు. దీంతో పోలీసులు కొరిశపాడు, అద్దంకి తహసీల్దార్లు సమాచారం ఇవ్వగా....వారు అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ ఇంటికి వెళ్లే దారిలో నిర్మించిన గోడను కూల్చివేస్తేనే తిరిగి వెనక్కి వెళ్తానని ఆమె స్పష్టం చేశారు. దీంతో పోలీసులు రాత్రి 11 గంటల సమయంలో బలవంతంగా ఆమెను, కుటుంబ సభ్యులను పోలీసు వాహనంలోకి ఎక్కించి సొంత గ్రామానికి తరలించారు.
వైకాపా నాయకుడి తీరుపై లోకేశ్ మండిపడ్డారు. ఆస్తి ఎవరిదైనా వైకాపా వాళ్ల కన్నుపడితే కబ్జా, ఆక్రమణేనంటూ విమర్శించారు.
ఇవీ చూడండి