Atchannaidu comments at TDP state wide meeting : తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఎన్నికలపై నేతలకు దిశా నిర్దేశం చేస్తూ చంద్రబాబు ప్రసంగించారు. భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో విడుదల చేసిన మినీ మేనిఫెస్టోను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశంపై సమావేశంలో ప్రముఖంగా చర్చించారు.
చంద్రబాబుతో చెప్పించుకునే పరిస్థితి రావొద్దు.. ప్రజలు తెలుగుదేశం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా.. తనతో సహా నేతలు పూర్తి స్థాయిలో పని చేయడం లేదనే ఫీలింగ్ ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. వచ్చే రోజుల్లో ప్రజల్లో ఉండేలా కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించారు. జగన్ అప్పులు తెచ్చి అరకొర సంక్షేమం చేశారని, చంద్రబాబు సంపద సృష్టించి పూర్తి సంక్షేమం చేపడతారని.. దసరాకి విడుదల చేసే మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి అంశాలుంటాయని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను.. ప్రచార కార్యక్రమాలను నేతలు సీరియస్‌గా తీసుకోవాలని సూచిస్తూ.. చంద్రబాబుతో చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని అచ్చెన్నాయుడు తెలిపారు.
నేరాలకు అడ్డాగా మారిన విశాఖ.. రాష్ట్రానికి ఓ క్రిమినల్ ముఖ్యమంత్రిగా ఉండటంతో ఏపీ నేరాంధ్రప్రదేశ్ అయిందని శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. రాజధాని అని చెప్పిన విశాఖ కాస్తా నేరాలకు రాజధానిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంపీ కుటుంబ కిడ్నాప్ ఉదంతంపై సీబీఐ విచారణ డిమాండ్ చేస్తున్నామని తెల్చిచెప్పారు. నాలుగేళ్లుగా ప్రజలు జగన్ పాలనతో విసిగిపోయారని మండిపడ్డారు.
మెగా మేనిఫెస్టోతో మైండ్ బ్లాక్.. తెలుగుదేశం ప్రకటించిన మినీ మేనిఫెస్టో ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా 1.22లక్షల ఆర్ధిక సాయం అందనుందని టీడీపీ సీనియర్ నేత జీవీ ఆంజనేయులు తెలిపారు. వీటికి అదనంగా 3గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అదనమని పేర్కొన్నారు. రేపట్నుంచే భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్ర ఊరూరు తిరుగుతుందన్నారు. రాష్ట్ర సంపద పెంచాలన్నా, దాన్ని పేదలకు పంచాలన్నా అది చంద్రబాబుతోనే సాధ్యమని జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. తెలుగుదేశం మినీ మేనిఫెస్టోతోనే వైఎస్సార్సీపీ మైండ్ బ్లాక్ అయిందని.. దసరా నాటికి విడుదల చేసే మెగా మేనిఫెస్టోతో ఇంకేం జరుగుతుందో అని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయని, ప్రభుత్వ అసమర్థత, ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యం వల్లే అరాచకాలు పెరిగిపోతున్నాయని జీవీ ఆంజనేయులు దుయ్యబట్టారు.
బీహార్‌ను మించిపోయిన ఏపీ.. నేరాల్లో ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాన్ని మించిపోయిందని విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం ఇంచార్జి ఎం. భరత్ ధ్వజమెత్తారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించటంతో ఏ మూల చూసినా అరాచకాలే కనిపిస్తున్నాయన్నారు. విశాఖలో భూ కబ్జాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఓ ఎంపీ కుటుంబానికే రక్షణ లేదంటే ఇక సామాన్యుల పరిస్థితేంటనీ ప్రశ్నించారు. తెలుగుదేశం మినీ మేనిఫెస్టోకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజాదరణ లభిస్తోందన్నారు. అసలు మేనిఫెస్టో త్వరలోనే ప్రజల ముందుకు రానుందన్నారు.