TDP Party Meeting In Mangalagiri: మరుగుజ్జు జగన్ అంటే తెలుగుదేశానికి లెక్కలేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో నిర్వహించారు. ఈ సమావేశంలో లోకేశ్‌తోపాటు టీడీపీ నాయకులు, నేతలు, శ్రేణులు పాల్గొన్నారు. చంద్రబాబు కుర్చీని ఖాళీగా ఉంచి సమావేశాన్ని నిర్వహించారు. తెలుగుదేశానికి సంక్షోభాలు కొత్త కాదన్నారు. ఇందిరాగాంధీ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని 1984లో కూల్చీవేస్తే.. ఐక్యంగా పోరాడి తిరిగి ఎన్టీఆర్‌ని ముఖ్యమంత్రి చేసినట్లు గుర్తు చేశారు. తన తల్లి భువనేశ్వరిపైనా అక్రమ కేసు పెడతామంటూ ఆమె ఐటీ రిటర్న్స్ చూపి సీఐడీ తనను బెదిరించిందని ఆరోపించారు.
శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించటమే కాకుండా.. కారాగారంలోనున్న చంద్రబాబుకు పంపించే భోజనంలో విషం కలుపుతామని వైసీపీ మంత్రులు ఎన్నో ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తన తల్లి ఏ రోజైనా రోడ్డుమీదకు వచ్చారా అని ప్రశ్నించారు. సేవా కార్యక్రమాలు తప్ప రాజకీయాలు తన తల్లికి తెలియదన్నారు. తన తల్లి గవర్నర్ను కలవడానికి కూడా వెళ్లలేదని తెలిపారు. తన తల్లి.. బ్రాహ్మణిలు కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారని.. వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారని.. భోజనాల్లో విషం కలపడం, బాబాయ్‌ని లేపేయటం, కోడికత్తి డ్రామాలు తమ డీఎన్ఏలో లేవని స్పష్టం చేశారు.
ప్రశ్నించడమే చేసిన నేరమా: రాజకీయాల్లోకి వస్తానన్నప్పుడు, కత్తి పడితే కత్తితోనే పోతావని.. తన తండ్రి తనకు హిత బోధ చేశారని లోకేశ్ వివరించారు. చంద్రబాబు ఇచ్చిన పోరాట స్పూర్తితోనే ముందుకు సాగుదామని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతులు, మహిళలు, నిరుద్యోగుల కోసం ప్రశ్నించడమే చంద్రబాబు చేసిన నేరమా అని ప్రశ్నించారు. ఇసుక దోపిడీ, మద్యం మాఫియా గురించి మాట్లాడడమే చంద్రబాబు చేసిన తప్పా అని నిలదీశారు.
టీడీపీ, జనసేన మధ్య చిచ్చుకై పేటీఎం బ్యాచ్: తెలుగుదేశం-జనసేన పొత్తు ఉండకూడదని నాలుగున్నారేళ్లుగా జగన్ అనుకున్నది నెరవేరలేదని లోకేశ్ అన్నారు. చివరకి తెలుగుదేశం-జనసేన పొత్తు కుదిరిందని స్పష్టం చేశారు. రెండు పార్టీల మధ్య విబేధాలు వచ్చేలా పేటీఎం బ్యాచ్ ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ విషయంలో వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. జగన్ ఇంట్లో ఏం జరుగుతుందో తాము నోరు విప్పితే తల ఎత్తుకోలేరని హెచ్చరించారు.
Lokesh meets Amit Shah: రాజకీయ కక్షతో పెట్టిన కేసులు.. నిజం వైపు ఉండాలని అమిత్‌షాను కోరా: లోకేశ్
జగన్ ఇంట్లో విషయాలు బయటకు తీయాలంటే తమకు సంస్కారం అడ్డు వస్తోందని లోకేశ్ అన్నారు. వ్యక్తిగత విమర్శలు వద్దని చంద్రబాబు తమకు చెప్పారన్నారు. కోట్లు.. లక్షల రూపాయలతో బాత్రూంలు నిర్మించుకునే జగన్ పేదవాడంట అని విమర్శలు గుప్పించారు. లక్ష రూపాయలతో చెప్పులు ధరించే జగన్ పేదవాడా అని ప్రశ్నించారు. నవంబర్ 1వ తేదీ నుంచి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం.. చంద్రబాబు ఆపిన చోటే నుంచే ప్రారంభిస్తామని వెల్లడించారు.
జగన్ సిగ్గుతో ముక్కు నేలకు రాయాలి: స్కిల్ డెవలప్మెంట్ పై శుక్రవారం ప్రధాని చేసిన ప్రకటనతోనైనా.. సీఎం జగన్ సిగ్గుతో ముక్కు నేలకు రాయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు జైలులో ఉంటే తెలుగుదేశం ఇక పుంజుకోదనే తప్పుడు ఆలోచనతో జగన్ బూమరాంగ్ అయ్యాడని ఆక్షేపించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి రావటానికి తెలుగుదేశం సిద్ధంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
యావత్ తెలుగుజాతి జగన్మోహన్ రెడ్డిని అసహ్యించుకుంటోందని ధ్వజమెత్తారు. జగన్ పిచ్చి పరాకాష్టకు చేరింది కాబట్టే అక్రమ కేసులు పెట్టి చంద్రబాబుని అరెస్టు చేయించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా నిర్భంధించగలడేమో కానీ ప్రజల హృదయాల నుంచి తొలగించలేడని తెలిపారు. చంద్రబాబు బయటకు వచ్చేవరకు లోకేశ్ ఆలోచనలతో ముందుకు వెళ్లనున్నట్లు వివరించారు. సరైన సమయంలో మంచి హృదయంతో తెలుగుదేశానికి జనసేన తోడైందన్నారు.
పేదల భూములు రికార్డులు మారిస్తే సెటిల్మెంట్లు: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి పార్టీ విస్తృత స్థాయి సమావేశం నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పెద్ద ఐరన్ లెగ్ అనటానికి రాష్ట్రంలో తాండవిస్తున్న కరవే నిదర్శనమని దుయ్యబట్టారు.పేదల భూములు రికార్డులు మారిస్తే, సీఎంవోకి పిలిచి సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీని ఎప్పుడెప్పుడు బంగాళాఖాతంలో కలుపుదామా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. వైసీపీ పేరు వింటేనే తిరగబడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఓట్ల దొంగల పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వ్యంగ్యస్త్రాలు విసిరారు.