TDP Nyayaniki Sankellu Protest Against CBN Arrest: ఆధారాలు లేకపోయినా, రాజకీయ కక్షతోనే అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారని.. లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి నినదించారు. హైదరాబాద్లోని తమ నివాసంలో చేతులకు తాళ్లు కట్టుకుని ఆందోళన చేపట్టారు. రాజమహేంద్రవరంలో తెలుగుదేశం క్యాంపు కార్యాలయం వద్ద న్యాయానికి సంకెళ్లు నిరసన కార్యక్రమంలో నారా భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో టీడీపీ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు సంకెళ్లు వేసుకుని ర్యాలీ చేపట్టారు. విజయనగరంలో చంద్రబాబుకు బాసటగా వాజీ ఛానల్ "చంద్రన్నకు అండగా రైతన్న" సదస్సు నిర్వహించింది. విశాఖ జిల్లా పెందుర్తిలో బండారు సత్యనారాయణ, నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నిరసనలో పాల్గొన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
కోనసీమ జిల్లా కొత్తపేట, రాజోలులో సంకెళ్లతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో తెలుగుదేశం శ్రేణులు కాగడల ర్యాలీ చేపట్టాయి. ఏలూరు జిల్లా దెందులూరులో చింతమనేని ప్రభాకర్, జి కొండూరులో దేవినేని ఉమా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గుంటూరు లాడ్జి సెంటర్, బృందావన గార్డెన్స్ లో మహిళలు, చిన్నారులు కళ్లకు గంతలు, చేతులకు తాళ్లు కట్టుకుని నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులోనూ ముస్లిం మహిళల ఆధ్వర్వంలో ఆందోళన తెలిపారు.
విజయవాడలో పప్పుల మిల్లుల సెంటర్ ఆంజనేయస్వామి గుడి వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ గద్దె అనురాధ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్, బాపట్ల జిల్లా కర్లపాలెం, పిట్లవానిపాలెం మండలాల్లో సంకెళ్లు వేసుకుని ఆందోళన చేపట్టారు. ఉయ్యూరులో తెలుగుదేశం, జనసేన నాయకుల ఆధ్వర్యంలో న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం నిర్వహించారు.
నెల్లూరులో డైకస్ రోడ్డు సెంటర్ వద్ద ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలు, కర్నూలులో సంకెళ్లు వేసుకుని నేతలు బాబుకు సంఘీభావం తెలిపారు. వైఎస్‌ఆర్ జిల్లా పులివెందుల పార్టీ కార్యాలయంలో మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో కియా కార్ల తయారీ పరిశ్రమ ఎదుట ఆందోళన చేశారు. తిరుపతిలో న్యాయానికి సంకెళ్లు కార్యక్రమంలో భాగంగా చేతులకు సంకెళ్లు, నల్ల రిబ్బెన్లు కట్టుకొని చంద్రబాబుకు మద్దతు పలికారు.
అనంతపురం జిల్లా రామగిరి మండలం గంగంపల్లి తాండాలో న్యాయానికి సంకెళ్లు కార్యక్రమంలో భాగంగా మోకాళ్లపై కూర్చుని చేతులకు నల్ల రిబ్బన్ సంకెళ్లతో ధర్నా చేశారు. రాయదుర్గంలో మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు నివాసం వద్ద న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబుకు సంఘీభావంగా జర్మనీలోనూ వినూత్న నిరసన చేపట్టారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ.. 'న్యాయం కోసం బిక్షాటన' పేరిట న్యాయదేవత ఎదుట జోలె పట్టి అభ్యర్థించారు.