హైదరాబాద్‌లో స్వీయ నిర్బంధం కారణంగా గుంటూరుకు రాలేకపోయానని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్నవారికి ఆయన అభినందనలు తెలిపారు. జూమ్ యాప్ ద్వారా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లో పీసీఆర్ టెస్టులు చేస్తున్నారన్న ఆయన... ఏపీలో ట్రూనాట్, క్లియా టెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏపీలో పూలింగ్ పద్ధతిలో మంచి ఫలితాలు రాబడుతున్నారని ఆయన ప్రశంసించారు. ఇతర ప్రాంతాల్లో ఉండిపోయిన వలస కూలీలను తీసుకొచ్చే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జయదేవ్ కోరారు. రోజువారీ పనులు చేసుకునేవారికి వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు.
కరోనాపై గుంటూరు కలెక్టర్‌తో ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడానని జయదేవ్ వెల్లడించారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో 199 కేసులు ఉన్నాయని తెలిపారు. సహాయక చర్యలపై అధికారులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో జాగ్రత్తలతోపాటు నిత్యావసరాల పంపిణీ చేయాలని అధికారులను కోరినట్లు చెప్పారు.
ఇదీ చదవండి