చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనపై తెలుగుదేశం నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ తెలుగుదేశం నేతలకు సమయమిచ్చారు. వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, ఆలపాటి రాజాతో కూడిన బృందం గవర్నర్ కలసి నిన్న జరిగిన సంఘటనపై పూర్తి వివరాలు అందజేయనున్నారు. వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ దండయాత్రగా చంద్రబాబు నివాసం పైకి వచ్చాడని సీసీటీవీ వీడియోలను తెలుగుదేశం నేతలు గవర్నర్‌కు సాక్ష్యాలుగా అందజేయనున్నారు.
ఇలా మొదలైన వివాదం..
ముఖ్యమంత్రి సీఎంను 'ఓ మై సన్' అని చర్చిలో ఫాదర్లు సంబోధించేట్లు జగన్ను అన్నానని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు తెలిపారు. దీంతో వివాదం మొదలైంది.
వివరాలు.. అయ్యన పాత్రుడు మాటల్లోనే..
"ముఖ్యమంత్రిని తాను తిట్టలేదని..'ఓ మై సన్' అని చర్చిలో ఫాదర్లు సంబోధిస్తారని.. అదేరీతిలో తెలుగులో అన్నానని స్పష్టం చేశారు. నా వ్యాఖ్యలపై కావాలనే వైకాపా శ్రేణులు రచ్చ చేస్తున్నాయని".
-అయ్యన్న పాత్రుడు, తెదేపా నేత
కాగా గురువారం మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ సంస్మరణ సభలో తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన ఈ వ్యాఖ్యలకు నిరసనగా వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ సహా పలువురు నేతలు, కార్యకర్తలు చంద్రబాబు నివాసం ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో ప్రధాన ద్వారం ముందు జోగి రమేశ్, వైకాపా కార్యకర్తలు బైఠాయించారు. దీంతో తెదేపా-వైకాపా కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇరు వర్గాల నినాదాలతో తోపులాట జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఇరువర్గాలను అదుపు చేసేందుకు యత్నించే క్రమంలో లాఠీఛార్జ్ చేశారు.
ఈ క్రమంలో జోగి రమేష్, బుద్ధా వెంకన్న మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్రబాబు ఇంటి దగ్గర నిరసన ఎందుకు చేపడుతున్నారంటూ బుద్ధా నిలదీశారు. అదే సమయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య పరస్పర నినాదాలతో హోరెత్తించారు. ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో బుద్ధా వెంకన్న స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సొమ్మసిల్లి కిందపడిపోయారు.
సంబంధిత కథనాలు