Arja Srikanth Attends For CID Investigation: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ అధికారులు మాజీ ఎండీ ఆర్జా శ్రీకాంత్ ను విచారించారించండపై టీడీపీ నేతలు స్పందించారు. సుమారు 11 గంటల పాటు తాడేపల్లి సీఐడి కార్యాలయంలో విచారించారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో అవతవకలు జరిగాయనే ఆరోపణలతో సీఐడి కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి వ్యవహారం మళ్లించేందుకే స్కిల్ డెవలప్మెంట్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.
స్పందిచన టీడీపీ నేతలు: జగన్ జైలుకు వెళ్లివచ్చారు కాబట్టి విపక్షాల వారిని కూడా జైలుకు పంపాలనే కుట్ర పన్నారని, మాజీమంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. అందుకే సీఐడీ కేసులతో అందరినీ వేధిస్తున్నారని ఆరోపించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థలో అక్రమాల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి ఆర్జా శ్రీకాంత్ ను సీఐడీ విచారించటాన్ని కన్నా తప్పుబట్టాడు. శ్రీకాంత్ ముప్పై సంవత్సరాలుగా నిజాయితి, నిబద్ధతతో పని చేశారని కన్నా వెల్లడించారు. శ్రీకాంత్ ఎక్కడా చెడ్డపేరు తెచ్చే పని చేయలేదని కితాబిచ్చారు.
ఆంధ్రా భవన్ రెసిడెంట్ కమిషనర్ గా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం కృషి చేశారని కన్నా తెలిపారు. కోవిడ్ సమయంలో సైతం ప్రజలకు మంచి వైద్య సేవలందించేందుకు పని చేశారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం కూడా శ్రీకాంత్ ను అత్యున్నతమైన అధికారిగా గుర్తించి సన్మానించిందని కన్నా గుర్తు చేశారు. అదే శ్రీకాంత్ పై ఇప్పుడు అక్రమ కేసులు పెట్టి వేదిస్తున్నారని కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. సీఐడీ కేసులతో ఇలా అందరినీ ఇబ్బంది పెట్టడం గతంలో ఎప్పుడూ లేదన్నారు. ఈ వ్యవహారంలో గతంలో పని చేసిన ప్రేమచంద్రారెడ్డిని ఎందుకు విచారించటం లేదని కన్నా ప్రశ్నించారు.
బోండా ఉమామహేశ్వరరావు: అవినాష్ రెడ్డి వ్యవహారం మళ్లించేందుకే స్కిల్ డెవలప్మెంట్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. 370 కోట్ల రూపాయలు చేతులు మారాయి అని అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. అర్జా శ్రీకాంత్ ని విచారణ పేరుతో రోజు బెదిరిస్తున్నారన్నారు. తాడేపల్లి ఆదేశాలతో అధికారులు అర్జా శ్రీకాంత్ విషయంలో ఇష్టానుసారం వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఐడీ అధికారులు నాలుగు సంవత్సరాల నుంచి దర్యాప్తు చేస్తున్నా, ఎలాంటి అవినీతి నిరూపించలేకపోయారని బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.
ఇవీ చదవండి: