TDP Leaders on CM Jagan: రాష్ట్రంలో సీఎం జగన్ పాలన నేరపూరితంగా, అవినీతిమయంగా సాగుతోందని.. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. గుంటూరులో జగనాసుర పేరుతో నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పది తలల జగన్ ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు ఇంటింటికీ తిరిగి అంటించిన స్టిక్కర్లును.. జనం వెంటనే తొలగించటమే దీనికి నిదర్శనమన్నారు.
అవినీతి, నేరాల రాక్షసుడు జగన్: ముఖ్యమంత్రి జగన్ - అవినీతి, నేరాల రాక్షసుడు అని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి అన్నారు. తన తండ్రి మరణాన్ని వాడుకుని ఓదార్పు యాత్ర పేరుతో 2014 ఎన్నికలకు ముందు రాజకీయంగా ఎదగాలని ప్రయత్నించాడు. 2019 ఎన్నికలు వచ్చే సరికి సొంత బాబాయిని హతమార్చి, తన సంకల్ప యాత్రకి నాంది పలికి శవ రాజకీయాలలో ఉన్న నేర్పుని మరోసారి బయటపెట్టాడని ఆరోపించారు. తన స్వార్ధ ప్రయోజనాల కోసం కుటుంబాన్ని సైతం బలిచేసాడని మండిపడ్డారు. అనంతరం జగన్ దశావతారాల చిత్రపటాలను చింపేసి నిరసన వ్యక్తం చేశారు.
ఆ గతే జగన్‌కు కూడా: జగనాసుర చరిత్రపై మచిలీపట్నంలో తెలుగుదేశం నేతలు కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ధర్మాన్ని పాటించని నియంతలకు పట్టిన గతే జగన్మోహన్ రెడ్డికి పడుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. రోజుకో మలుపు తిప్పుతున్న వివేకా హత్యపై ఎన్ని సీరియళ్లు అయినా తీయొచ్చని ఎద్దేవా చేశారు. ఈ కేసులో సీబీఐ వేట ముగింపు దశకు వచ్చిందన్నారు.
చంద్రబాబుపై అబద్ధపు ప్రచారాలతో లబ్ధి: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పాలనలో అవినీతి పెరిగిందని గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కోడి కత్తి కేసు డ్రామా, బాబాయ్‌ని అతి కిరాతకంగా చంపి నాటకం ఆడారని విమర్శించారు. చంద్రబాబుపై అబద్ధపు ప్రచారం చేసి లబ్ధి పొందారని ఆగ్రహించారు. మాస్కు గురుంచి మాట్లాడినందుకు మత్తు వైద్యుడు సుధాకర్‌ని పిచ్చి వాడిని చేసి చంపేశారని ధ్వజమెత్తారు.
జగన్‌కు మరో అవకాశం ఇస్తే అంతే: ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకుంటూ నాశనం చేశారని కడప టీడీపీ బాధ్యులు అమీర్ బాబు మండిపడ్డారు. జగనాసుర పేరిట కడపలో టీడీపీ ఆధ్వర్యంలో పది తలల జగన్మోహన్ రెడ్డి బొమ్మను తయారు చేశారు. ఒక్కో తలపై ఒక్కో అవినీతి చరిత్రను రాసి దాన్ని వివరిస్తూ ఒక్కో తల ఉన్న పేపర్‌ను చించి వేసి నిరసన తెలియజేశారు. లిక్కర్, ఇసుక, భూ కబ్జా, మట్టి మాఫియా, హత్యలు. దాడులు తదితర అంశాలను వివరిస్తూ నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేశారని ఆరోపించారు. జగన్‌కు మరో అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేస్తారని తెలిపారు.
వివేకా హత్య కేసును సీబీఐ లోతుగా దర్యాప్తు చేసి..!: మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసు ఐదేళ్లుగా సాగుతోందని.. నిందితులను అరెస్టు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో నిర్వహించిన జగనాసుర రక్త చరిత్ర కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. వివేకా కేసును సీబీఐ లోతుగా విచారణ చేపట్టి కుట్రదారులను కూడా అరెస్టు చేయాలన్నారు. నాడు పరిటాల రవీంద్ర కేసును సీబీఐ విచారించిందని అప్పుడు సీబీఐ అధికారులు జగన్ ఇంటికి వెళ్లి విచారణ చేశారన్నారు.
సైకో పోవాలి.. సైకిల్ రావాలి: వైసీపీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటిస్తుంటే గ్రామస్థులు అడ్డుకొని చెప్పులతో దాడి చేస్తున్నారంటే వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్థమవుతుందని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం జగనాసుర రక్త చరిత్ర నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలతో పాటు వేలాది కోట్ల రూపాయల దోచుకున్న A1 జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు సూచించారు. జగన్ చేస్తున్న అక్రమాలు, అరాచకాలను పది తలల జగనాసుర చిత్రపటం ప్రదర్శించారు.
ఇవీ చదవండి: