TDP Leaders on Farmers: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోకపోగా వారిని మోసగిస్తోందని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. నాలుగు సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో రైతుల్ని మోసగిస్తూనే వస్తున్నారని దుయ్యబట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన ప్రతీ రైతు వివరాలను టీడీపీ బృందం సేకరిస్తోందని తెలిపారు. తరుగు, తేమ పేరుతో రైస్ మిల్లర్లు దోచుకున్న మొత్తాన్ని తిరిగి రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.
"పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం మోసగిస్తోంది. రైతుల విషయంలో జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పలకరించడానికి కూడా మనసు రాలేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి గ్రామంలో కమిటీ వేసి పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరిస్తున్నాం. వర్షాలకు నష్టపోయిన రైతుల వివరాలను టీడీపీ సేకరిస్తోంది. తరుగు పేరుతో రైస్ మిల్లర్లు దోచుకున్న మొత్తాన్ని చెల్లించాలి. టీడీపీ వచ్చాక రైతులకు జరిగిన నష్టం మొత్తం చెల్లిస్తుంది. అలాగే గోనె సంచులు, హమాలీలు, రవాణా పేరుతో కేంద్రం ఇచ్చిన డబ్బులను ఎవరు మింగారో అది కూడా సమాధానం చెప్పాలి "-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేత
ప్రభుత్వం పట్టించుకోకుంటే టీడీపీ అధికారంలోకి రాగానే రైతుకు జరిగిన నష్టం మొత్తం చెల్లిస్తుందని భరోసా ఇచ్చారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో ఏ రైతూ సంతృప్తిగా లేడని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల్ని సైతం పక్కదారి పట్టించి.. వైసీపీ ప్రభుత్వం రైతుల్ని మోసగించిందని ఆక్షేపించారు. జగన్మోహన్ రెడ్డి అసమర్థ విధానాల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో వ్యవసాయం నిర్వీర్యమై కౌలు రైతులు వలసపోతున్నారని మండిపడ్డారు.
"ఈ నెల 14న నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తాం. ఈ నెల 16-24 వరకు నష్టపోయిన రైతుల కోసం నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. సేకరించిన సమాచారాన్ని ఈ నెల 26న కలెక్టర్లకు అందిస్తాం"- మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ నేత
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు నష్టం జరిగిందని.. తుపాను వల్ల కాదన్నారు. మిల్లర్లను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ పెద్దలే రైతుల సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు. ఈ నెల 14వ తేదీన నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి.. 16 నుంచి 24వ తేదీ వరకు నష్టపోయిన రైతుల కోసం నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 26వ తేదీన కలెక్టర్లకు నమోదైన సమాచారం అందచేస్తామని తెలిపారు. పంట అమ్ముకోవాలంటే కూడా రైతు అప్పు చేసే దుస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉందని విమర్శించారు. రైతుల పేరు మాటున పెద్ద కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.