TDP Leaders Celebrations: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా 100రోజులు పూర్తి చేసుకుంది. లోకేశ్ చేపట్టిన పాదయాత్ర వందరోజుల మైలురాయిని చేరుకున్న సందర్భంగా... రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు సంబరాలు చేసుకున్నారు. లోకేశ్‌కు మద్దతుగా అనేక ప్రాంతాల్లో సంఘీభావ యాత్రలు నిర్వహించారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి యువగళం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కేక్ కట్ చేసి... రోడ్ షోలు చేస్తూ నేతలు, కార్యకర్తలు వేడుకలు జరుపుకున్నారు. జనవరి 27 న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకర్గం నుంచి ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర.. నంద్యాల జిల్లాలో కొనసాగుతుంది.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర వందోరోజు సందర్భంగా... శ్రీకాకుళంలో ఆ పార్టీ నేతలు భారీ సంఘీభావ యాత్ర చేపట్టారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో లోకేశ్‌కు మద్దతుగా ర్యాలీ చేసి వేడుకలు జరుపుకున్నారు. పార్వతీపురంలో తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి... పాదయాత్ర చేపట్టారు. అనకాపల్లి, కాకినాడ జిల్లా తునిలో తెదేపా శ్రేణులు సంఘీభావ యాత్ర చేపట్టారు. కోనసీమ జిల్లా వాడపాలెం, ముమ్మిడివరంలో తెదేపా నేతలు భారీ ర్యాలీ చేపట్టగా... ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో యువగళం మరింత విజయవంతం కావాలని పూజలు చేశారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్... తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి 50 కిలోల కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెంలో తెదేపా నేతలు ర్యాలీ చేశారు. గన్నవరంలో దేవినేని అపర్ణ, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి దేవినేని చందు.. అన్న క్యాంటీన్ ప్రారంభించారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ఆత్మకూరు వరకు 6 కిలోమీటర్ల మేర సంఘీభావ యాత్ర చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి.. లోకేశ్‌కు మద్దతుగా తెదేపా నేత నక్కా ఆనందబాబు పాదయాత్ర చేశారు.
ప్రకాశం జిల్లా పామూరులో చేపట్టిన సంఘీభావ యాత్రలో భారీ సంఖ్యలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ఆదోనిలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. కోడుమూరులో ఎన్టీఆర్ విగ్రహం ముందు వంద కొబ్బరి కాయలు కొట్టారు. నంద్యాల పద్మావతినగర్ నుంచి గాంధీచౌక్ వరకు పాదయాత్ర నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలోని మల్లినాయికనపల్లిలో ఆంజనేయస్వామికి 101 టెంకాయలు కొట్టారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి, రైల్వేకోడూరులో ఆ పార్టీ నాయకులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.
పులివెందులలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆధ్వర్యంలో 7 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం, గుంతకల్లు, రాయదుర్గంలోనూ సంఘీభావ యాత్రలు నిర్వహించారు
ఇవీ చదవండి: