TDP Leaders comments on YS Jagan: రైతుల కష్టాన్ని, వారి భూముల్ని దోచుకునే సీఎం జగన్ రెడ్డి రైతుల ద్రోహి కాక, రైతు బాంధవుడా అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. జగన్ రెడ్డి అసమర్థతతో రాష్ట్ర వ్యవసాయ రంగం నిర్వీర్యమైందని ధ్వజమెత్తారు. పనిచేయని రైతు భరోసా కేంద్రాలు, అరకొరగా ఇచ్చే రైతు రుణమాఫీలు.. రైతుల్ని రక్షించి, వ్యవసాయాన్ని బతికించదు జగన్ రెడ్డి అని ఎద్దేవా చేసారు. చంద్రబాబు రైతులకు అందించిన పథకాల్ని ఎందుకు రద్దు చేశాడో జగన్ అన్నదాతలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. రివర్స్ టెండరింగ్ డ్రామాలతో పోలవరాన్ని నాశనం చేసిన ఘనుడు మన సీఎం జగన్ అని మండిపడ్డారు.
అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్న జగన్, ఈ నాలుగేళ్లలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి కల్పించాడని ఆక్షేపించారు. నాలుగేళ్లలో తాను, తన ప్రభుత్వం రైతుల్ని ఏవిధంగా దోచుకుందో చెప్పడానికి జగన్ తెనాలి వస్తున్నాడని నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్ దుగ్గిరాల పసుపు రైతుల వేదన, రోదనపై ఏం చెబుతాడని ప్రశ్నించారు. ఎన్నికల దృష్ట్యా రైతుల్ని మరోసారి వంచించి, తన పబ్బం గడుపుకోవాలని జగన్ చూస్తున్నాడని విమర్శించారు.
బటన్లు నొక్కే కార్యక్రమంతో జగన్ కల్లబొల్లి మాటలు చెప్పాడు.. ఈ నాలుగు సంవత్సరాల నుంచి రైతుల్ని కష్టాల నుంచి నష్టాల నుంచి వ్యవసాయాన్ని పండగ చేస్తాన్నారు. సంవత్సరానికి 13వేల 500 రుపాయలు ఇస్తానన్న మీరు రైతుల్ని మోసం చేశారు. ఎరువులు కొనాలంటే రైతులు క్యూలో నుంచో వలసి వస్తుంది.. అది కుడా కృత్రిమ కొరతగా ఉంది.- ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రి
విద్యను అథమ స్థాయికి దిగజార్చారు: సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యను ప్రథమ స్థాయి నుండి అథమ స్థాయికి దిగజార్చారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. స్కాలర్ షిప్స్ ఇవ్వాలని ప్రశ్నిస్తుంటే.. అమ్మ ఒడి అంటూ ప్రచారం చేసుకున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీఈ కింద ప్రైవేటు పాఠశాలలో సీట్లు కేటాయించమంటే దీనికి సైతం అమ్మ ఒడి జమ చేస్తున్నామంటూ చెప్పడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మ ఒడిని నాన్న బుడ్డిగా మార్చారని విమర్శించారు. దాదాపు 82 లక్షల మంది విద్యార్ధులకు గాను కేవలం 44 లక్షల మందికి మాత్రమే అమ్మ ఒడి ఇస్తూ.. దానిని 15వేల నుంచి 13వేలకు కుదించి 5 ఏళ్లకు బదులు 4 ఏళ్లకే అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేద విద్యార్ధులకు అందించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌ను నిలిపివేశారని దుయ్యబట్టారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నివేదిక ప్రకారం ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగంలో దేశంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని మండిపడ్డారు. ఉపాధి హామీ నిధులను దారి మళ్లించడంతో ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున వేరే ప్రదేశాలకు వలసలు వెళ్తున్నారని.. దీని ప్రభావం విద్యార్ధుల చదువుల మీద వారి భవిష్యత్తు మీద పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: