TDP Leader Payyavula Keshav Press Meet: టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచి వచ్చిన సమయంలో ప్రజలు నీరాజనాలు పలికారని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబు తప్పు చేయలేదని ప్రజలు నమ్మారని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పయ్యావుల కేశవ్ మాట్లాడారు.
ప్రజాభిమానం కట్టలు తెంచుకుంటే: రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లి వరకు సాగిన 14 గంటల ప్రయాణంలో అడుగడుగునా ప్రజలు చంద్రబాబుకు స్వాగతం పలికారని.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనం వచ్చారని పయ్యావుల కేశవ్ చెప్పారు. చంద్రబాబు.. ఎక్కడన్నా కారు దిగిన సందర్భం లేదని.. ప్రజాభిమానం కట్టలు తెంచుకుంటే ఎలా ఉంటుందో తాను చూశానని పయ్యావుల అన్నారు. చంద్రబాబు తప్పు చేయలేదని ప్రజలకు నమ్మకమని.. 70 దేశాల్లో ఆయనకు మద్దతు పలికిన సందర్భమిదని స్పష్టం చేశారు. చంద్రబాబుకు బాసటగా నిలిచిన ప్రతిఒక్కరికీ ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ నమస్కారాలు తెలియజేశారు.
పదేపదే అసత్యాలు: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని తాము ముందే చెప్పామన్నారు. 50 రోజులకు పైగా చంద్రబాబును జైలులో ఉంచారని.. 50 పైసలైనా ఆయనకు వచ్చాయని నిరూపించగలిగారా అంటూ పయ్యావుల కేశవ్ నిలదీశారు. పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తే ఆరోపణలు నిజమవుతాయా? అని ఆయన మండిపడ్డారు.
భారత ప్రభుత్వం కూడా ఒప్పందం చేసుకుంది: ఎంవోయూపై తేదీ లేదని.. 90-10 పద్ధతి అనేదే కాదని ఏదోదే చెబుతున్నారని.. 90-10 పద్ధతిని గుజరాత్ మాత్రమే కాదు.. మరో 5 రాష్ట్రాలు చేశాయని పయ్యావుల తెలిపారు. డబ్బు విడుదలకు ముందే 10 శాతం పెట్టుబడి అని స్పష్టంగా ఉందని.. సీమెన్స్ సంస్థతో 2017 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. భారత ప్రభుత్వం కూడా 90-10 పద్ధతిన ఒప్పందం చేసుకుందని.. మంచి ఒప్పందమని కేంద్ర కార్యదర్శే లేఖ రాశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఒప్పందంపైనా ఈడీతో విచారణ చేయించాలంటారా? అని పయ్యావుల నిలదీశారు.
ఈ ఒప్పందాలన్నీ కనిపించట్లేదా అంటూ పయ్యావుల ప్రశ్నించారు. ఎంవోయూపై తేదీ లేకుండా సంతకం పెట్టారని ఆరోపిస్తున్నారని.. బెవరేజస్ కార్పొరేషన్‌తో మీరు చేసుకున్న ఒప్పందాలు చూస్తే సంతకాలు లేనివి వందలు కనిపిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన కంపెనీ ఉంది జర్మనీలో అని.. సీమెన్స్‌కు మీరు లేఖ రాశారా.. రాస్తే మీకు సమాధానం వచ్చిందా చెప్పాలని నిలదీశారు.
Chandrababu Bail Celebrations in Telangana : చంద్రబాబుకు బెయిల్.. తెలంగాణలో టీడీపీ శ్రేణుల సంబురాలు
పదాల మార్పులపై కూడా ఆరోపణలా: పదాల మార్పులపై కూడా ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డ పయ్యావుల.. గ్రాంట్ ఇన్ ఎయిడ్‌కు బదులు గ్రాంట్ ఇన్ కైండ్‌గా రాసుకుంటారు.. సీమెన్స్ వాళ్లు ఇన్‌కైండ్ గ్రాంట్ అని అంటారు అని స్పష్టం చేశారు. అన్నీ గ్రాంట్లే.. అని పదాలే మార్పు అని.. దీనిపైనా ఆరోపణలా అంటూ ప్రశ్నించారు. పదాల వాడుకలో మార్పును ఏదో తప్పు జరిగినట్లు ఆరోపిస్తున్నారని.. భాష ఏదైనా భావం మాత్రం ఒక్కటే అని తెలిపారు. 90 శాతం సీమెన్స్ ఇస్తుందన్నదే ప్రధానమని పేర్కొన్నారు.
యువతకు ఉద్యోగాలు ఇస్తామని 2014 మేనిఫెస్టోలో చెప్పామన్న పయ్యావుల.. 2014 మేనిఫెస్టో ప్రకారం స్కిల్‌డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఏర్పాటు చేశామని తెలిపారు. తప్పు చేసింది ఒకరైతే ఇంకొకరి మీద కేసు పెడతారా అని ప్రశ్నించిన పయ్యావుల.. అవసరం మేరకే చంద్రబాబు సంతకాలు పెట్టారని అన్నారు. సీమెన్స్ ప్రాజెక్టు అద్భుతమని ఐఏఎస్ అధికారి సునీత, పీవీ రమేష్ నోట్ ఫైళ్లు రాశారని చెప్పారు.