NARA LOKESH IN BADUDE BADUDU : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూచించారు. చెత్త పన్ను కట్టట్లేదని జగన్ రెడ్డి.. పింఛన్‌కు కోత పెడుతున్నారని మండిపడ్డారు. నటనలో ఆళ్ల రామకృష్ణారెడ్డి.. సినిమా వాళ్లను మించిపోతున్నాడని ఎద్దేవా చేశారు. ఇప్పటంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకున్న ఎమ్మెల్యేనే.. పేదల ఇళ్లు కూలగొట్టించాడని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్తగా నిర్మించే అపార్టుమెంట్లకు రహదారి అడిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర ఆళ్ల రామకృష్ణా రెడ్డి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. తెదేపా అధికారంలోకి రాగానే మంగళగిరిలో 10వేల ఇళ్లు కట్టించి పేదలకు ఇస్తానని హామీ ఇచ్చారు. తెదేపా ప్రభుత్వంలో అమల్లో ఉండి.. ఇప్పుడు రద్దు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని తెలిపారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మంగళగిరి పట్టణంలో లోకేశ్ పర్యటించారు. లోకేశ్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. త్వరలో చేపట్టే పాదయాత్ర విజయవంతం కావాలంటూ మహిళలు హారతులు ఇచ్చారు. నారా లోకేశ్ సమక్షంలో పలువురు వైకాపా కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు తెదేపాలో చేరారు.
మద్యం కుంభకోణంపై అబద్దాలు చెప్పే వైకాపా పెద్దలకు సిగ్గుండాలని లోకేశ్ ధ్వజమెత్తారు. వాస్తవాలు ఎలా కప్పిపుచ్చాలో సలహాదారులకు తెలియట్లేదని ఆరోపించారు. ఏ-2 తో బంధం ఉన్నవారంతా కేసుల్లో చిక్కుకుంటున్నారన్నారు. హామీలు మరిచిన వైకాపా ఎమ్మెల్యేలు ఇకనుంచి రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు.
ఇవీ చదవండి: