TDP Leader Bandaru Satyanarayana Murthy Arrested: ఉగ్రవాద శిబిరంపై దండెత్తడానికన్నట్లు అర్థరాత్రి వేళ వందలాది మందిపోలీసుల మోహరింపు.. ఇంటి గోడలు దూకి, కిటికీలు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు.. పోలీసులు, తెలుగుదేశం శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం.. వెరసి 22 గంటల నాటకీయ పరిణామాల అనంతరం తెలుగుదేశం సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని ఆయన స్వగ్రామం అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలంలో పోలీసుుల అదుపులోకి తీసుకుని గుంటూరు తరలించారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బడి మంజుల చేసిన ఫిర్యాదుపై నమోదైన కేసులో బండారును అరెస్టు చేశారు.
ముఖ్యమంత్రి జగన్‌ను దూషించారంటూ గుంటూరులోని అరండల్‌పేట ఎస్సై నాగరాజ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఆ పోలీసుస్టేషన్‌లో నమోదైన మరో కేసులో బండారు సత్యనారాయణమూర్తికి 41ఏ కింద నోటీసులిచ్చారు. ఆయన్ను అరెస్టు చేసే క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది.
బండారు సత్యనారాయణమూర్తిని అరెస్టు చేయడం కోసం ఆదివారం రాత్రి 10 గంటలకే పోలీసులు వెన్నెపాలెం చేరుకున్నారు. బయటి వారెవరూ ఊరిలోకి రాకుండా 5 కి.మీ.ల దూరంలోనే బారికేడ్లు పెట్టి నిలువరించారు. ఆయన ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను ఉంచి ఆ దరిదాపుల్లోకి ఎవరూ రాకుండా చేశారు. ఆయన నివాసం వద్దకు మీడియా వెళ్లకుండా అంక్షలు విధించారు. విషయం తెలుసుకున్న స్థానికులు, టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున బండారు ఇంటి వద్దకు చేరుకున్నారు.
సోమవారం ఉదయం స్థానిక డీఎస్పీ.. బండారు సత్యనారాయణమూర్తి ఇంట్లోకి వెళ్లి కేసు వివరాలు తెలిపి అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు తెలిపారు. నోటీసులు చూపించాలని బండారు కోరడంతో పోలీసులు వెనక్కి వచ్చేశారు. మరోసారి బండారును అదుపులోకి తీసుకునే క్రమంలో కొంతమంది పోలీసులు ఆయన ఇంటి గోడలు దూకి లోపలికి ప్రవేశించారు. ఆయన ఇంటి తలుపులను బాదారు. కిటికీల గ్రిల్స్ తీసి లోపలికి వెళ్లేందుకు యత్నించారు.
చివరికి బండారు సత్యనారాయణమూర్తి తలుపులు తీయడంతో అయిదుగురు పోలీసు అధికారులు లోపలికి వెళ్లి సుమారు అరగంట పాటు ఆయనతో మాట్లాడారు. అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు. అంతుకు ముందు దీక్ష సందర్భంగా కొంత నీరసించడంతో ఆయనకు వైద్య పరీక్షల కోసం అంబులెన్స్ రప్పించగా పోలీసులు అడ్డుకోవడంతో తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇంటిలోపలకి వెళ్లేందుకు యత్నించగా కార్యకర్తలు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.
ఎట్టికేలకు 22 గంటల అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసి వైద్యపరీక్షలు కూడా చేయకుండానే గుంటూరుకు తరలించారు. ప్రస్తుతం బండారును నగరంపాలెం పీఎస్‌లో పోలీసులు ఉంచారు. 153(ఏ), 294, 504,505 ఐపీసీ, 67 ఐటీ యాక్ట్ కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. సీఎం జగన్, మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలకు విడివిడిగా కేసులు నమోదు చేశారు. బండారు అరెస్ట్‌ను తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితోపాట ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఖండించారు.
పోలీస్ స్టేషన్ వద్ద ఆంక్షలు: గుంటూరు నగరంపాలెం పీఎస్ వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు. బండారు సత్యనారాయణ హైబీపీ, మధుమేహంతో బాధపడుతున్నారు. మందులు ఇచ్చేందుకు సత్యనారాయణ తనయుడు అప్పలనాయుడు స్టేషన్‌కు వచ్చారు. తండ్రిని కలిసేందుకు అప్పలనాయుడికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
ముందస్తు గృహనిర్బంధాలు: బండారు సత్యనారాయణ అరెస్టు దృష్ట్యా పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబును, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నగరంపాలెం పీఎస్‌కు ఎవరూ రాకుండా ముందస్తుగా గృహనిర్బంధాలు చేస్తున్నారు. మరోవైపు స్టేషన్ వద్ద భారీగా పోలీసుల మోహరించారు. స్టేషన్‌కు వచ్చిన కనపర్తి శ్రీనివాసరావు, కార్పొరేటర్ బుజ్జిని అరెస్టు చేశారు.