TDP Janasena Leaders Bhogi Celebrations in Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం - జనసేన శ్రేణులు భోగి వేడుకలు ఘనంగా జరుపుకొన్నాయి. భోగి సంకల్పంలో భాగంగా ప్రజా వ్యతిరేక జీవో ప్రతులను మంటల్లో వేసి నిరసనలు తెలిపారు. 'కీడు తొలగాలి ఏపీ వెలగాలి' అని శ్రేణులు ఆకాంక్షించారు. అబద్ధపు హామీలతో జగన్ గద్దెనెక్కారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ఎన్టీఆర్ భవన్ వద్ద నిర్వహించిన భోగి వేడుకల్లో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక జీవో పత్రాలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. వైసీపీ దుర్మార్గ పాలనను బంగాళాఖాతంలో కలిపి స్వర్ణయుగాన్ని తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కదలిరావాలని పిలుపునిచ్చారు. నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో భోగి సంకల్పం కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం జారీచేసిన ప్రజా వ్యతిరేక జీవో ప్రతులను భోగి మంటల్లో వేశారు.
విశాఖ ఎంవీపీ కాలనీలోని నివాసం వద్ద మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు భోగి మంటలు వేసి నిరసన తెలిపారు. వైసీపీ మునిగిపోయే నావ అని, అరాచక పాలనకు ముగింపు పలకడమే తెలుగుదేశం - జనసేన లక్ష్యమన్నారు. విశాఖ జిల్లా భీమునిపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట నియోజవర్గం ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో భోగిమంటలు వేశారు. వైసీపీ ప్రభుత్వ నాలుగున్నర ఏళ్ల ప్రజా వ్యతిరేక జీవోలను భోగిమంటల్లో తగలబెట్టారు.
వైఎస్సార్సీపీకి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది - రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయి : చంద్రబాబు
రాష్ట్రానికి పట్టిన కీడు తొలగాలంటూ ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమ భోగి మంటలు వేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి' అని కార్యకర్తలతో కలిసి నినదించారు. విజయవాడ తెలుగుదేశం కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగ పత్రాలను మంటల్లో తగలపెట్టారు. చీకటి పాలన పోయి, ప్రజా జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రజా వ్యతిరేక జీవో కాపీలను మంటల్లో వేసి కాల్చారు.
గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన భోగి వేడుకల్లో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు. 85 శాతం హామీలను జగన్ నెరవేర్చలేదంటూ ప్లకార్డులను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. తెలుగుదేశం - జనసేన ఆధ్వర్యంలో పిడుగురాళ్లలో భోగి వేడుకలు నిర్వహించారు. జలగాసురుడి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయమని భగవంతుణ్ణి ప్రార్ధించినట్లు మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో చీకటి జీవోలను దహనం చేశారు. అరాచక పాలన పోయి స్వర్ణయుగం రావాలంటూ చీరాలలోనూ నిరనస తెలిపారు.
ఊరూవాడా జోరుగా సంక్రాంతి సంబరాలు- భోగి మంటలు జీవితాల్లో వెలుగులు నింపాలంటూ ఆకాంక్ష
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ ఎదుట తెలుగుదేశం నేత ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో అప్రజాస్వామిక జీవోల ప్రతులను భోగిమంటల్లో వేశారు. ఇవాళ్టి నుంచైనా ప్రజలకు సుఖశాంతాలు కలగాలని ఆకాంక్షించారు. అనంతపురంలోని రాంనగర్‌లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో కార్యకర్తలు భోగిమంటల్లో జీవోలు కాల్చివేశారు. సైకో పోవాలి సైకిల్ రావాలని నినదించారు. అరవింద నగర్‌లో బండారు శ్రావణి జాబ్ క్యాలెండర్ అంటూ యువతను మోసగించారంటూ ప్రతులను భోగి మంటల్లో వేశారు. గుంతకల్లులో తెలుగుదేశం- జనసేన కార్యకర్తలు సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలో భోగి పండగ వేడుకలలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ప్రజా కంఠక పాలన అంతమవ్వాలంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వ ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. చీకటి పాలన నశించాలంటూ ఆదోనిలోనూ జీవోలను దహనం చేశారు. ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సీఎం జగన్ ఇబ్బందులకు గురిచేశారని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీటీ నాయుడు అన్నారు. జగన్ పాలనలో ప్రజలకు వ్యతిరేకంగా విడుదల చేసిన జీవోలను భోగిమంటల్లో వేసి తగలబెట్టారు.
"సంబరాల" రాంబాబు సొగసు చూడాల్సిందే! ఈ ఏడాది కూడా తనదైన శైలి నృత్యంతో ఆకట్టుకున్న మంత్రి
కడపలోని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి నివాసం ఎదుట భోగి సంబరాలు జరిపారు. ప్రజా వ్యతిరేక విధానాల పోస్టర్లను మంటల్లో వేశారు. జగన్‌ను ఇంటికి సాగనంపే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. జమ్మలమడుగు నగర పంచాయతీ కన్నెలూరులో టీడీపీ నేత భూపేష్ రెడ్డి భోగి సంబరాల్లో పాల్గొన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉపాధి చూపించే స్టీల్ ప్లాంట్, ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించి ఉద్యోగాలు ఇస్తామని సీఎం జగన్ అబద్ధపు హామీ ఇచ్చారని మండిపడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, తులసి దంపతులు ప్రజావ్యతిరేక జీవోలను మంటల్లో వేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పూజలు చేశారు. రాష్ట్రం వికసించాలంటూ ఏలూరులోని దుగ్గిరాలలో చింతమనేని ప్రభాకర్ భోగి మంటలు వేశారు. తెలుగుజాతికి స్వర్ణయుగం రావాలంటూ ఐ.పోలవరం మండలం మురమళ్లలో మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు జీవోలను దగ్ధం చేశారు.
విజయనగరంలో తెలుగుదేశం కార్యాలయంలో భోగి వేడుకలు జరిపారు. అరాచక పాలన నశించాలంటూ జిల్లా తెలుగేదశం ఇన్‌ఛార్జ్ అతిధి గజపతిరాజు, జనసేన నాయకురాలు పాలవలస యశస్వి చీకటి జీవో ప్రతులను మంటల్లో వేశారు. విశాఖ జిల్లా భీమునిపట్నంలోనూ తెలుగుదేశం నేతలు ప్రజా వ్యతిరేక జీవోలను భోగిమంటల్లో తగలబెట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి దన్ను దొర ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం జారీచేసిన ప్రజా వ్యతిరేక జీవోల ప్రతులను భోగి మంటల్లో నిరసన తెలిపారు.