తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రక్షణగా టోల్ ఫ్రీ నంబరును అందుబాటులోకి తెచ్చినట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. 73062 99999 నంబరుకి ఫోన్ చేసి దాడుల సమాచారం అందజేయవచ్చని ఆయన అన్నారు. వైకాపా దాడులు, బెదిరింపులను, పోలీసుల అక్రమ కేసులు వంటి వేధింపుల సమాచారం అధిష్ఠానం దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. కార్యకర్తలంతా సంయమనం పాటించి, న్యాయపరంగా ఎదుర్కొందామని లోకేశ్ అన్నారు.
పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు గుంటూరు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పామని లోకేశ్ వెల్లడించారు. 40 రోజుల్లో వందకు పైగా దాడులు, దౌర్జన్యాలు చేయడం గర్హనీయమన్నారు. ఆరుగురు తెదేపా కార్యకర్తలను అత్యంత దారుణంగా చంపారని లోకేశ్ ఆరోపించారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకే ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రతి జిల్లాలో తెదేపా లీగల్ సెల్‌ను సమాయత్తం చేస్తున్నామని లోకేశ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఏ సమస్య వచ్చినా తెలుగుదేశంపై తోసి తప్పుకోవాలని సీఎం జగన్ చూడటాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కార్యకర్తలకు అన్నివేళలా, అన్నివిధాలా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారని నారా లోకేశ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : ఆర్థికశాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం