TDP demands to bring back AP students: మణిపూర్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్ర విద్యార్థులను తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లో సైతం విద్యార్థుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటుగా.. నారా లోకేశ్, అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
సీఎస్‌కు చంద్రబాబు లేఖ: మణిపూర్ ఇంఫాల్‌లో స్థానిక ఘర్షణల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఇంఫాల్‌లో చెలరేగిన హింస అక్కడ చదువుతున్న ఎపి విద్యార్థులను ప్రమాదంలో పడేసిందన్నారు. అక్కడి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ, ఎన్‌ఐటీలలో సుమారు 100 మందికిపైగా తెలుగు విద్యార్థులు చదువుతున్నారని, స్థానిక పరిస్థితుల కారణంగా తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంఫాల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులను తరలించాలని సూచించారు. విద్యార్థులు ఇంటికి తిరిగి తీసుకువచ్చే వరకు వారి సంరక్షణ, సౌకర్యం కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో అక్కడ ఎన్ఐటీలో చదువుతున్న ఏపీ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కు మంటున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వెల్లడించారు. ఏపీకి చెందిన విద్యార్థులను తక్షణమే రాష్ట్రానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మణిపూర్ రాష్ట్రంలో ఏర్పడిన ఘర్షణలతో అత్యవసర పరిస్థితి విధించారని, ఇప్పటికే పరస్పర దాడుల్లో 54 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. చాలా జిల్లాల్లో కర్ఫ్యూ విధించారన్న లోకేశ్, హింసాత్మక ఘటనలను నియంత్రించడానికి కనిపిస్తే కాల్చివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. వివిధ యూనివర్సిటీలు, ఎన్ఐటీల్లో వందలాది మంది రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉన్నారని, వీరి భద్రత విషయమై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో వారిని తక్షణమే రాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ లోకేశ్ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులను ప్రత్యేక విమానంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకొచ్చిందని, ఏపీకి చెందిన విద్యార్థులు వేర్వేరు క్యాంపస్‌లలో బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బయట కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు, ఇంటర్నెట్ సేవలకి అంతరాయం ఉన్న నేపథ్యంలో ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లని విద్యార్థులు ఎలా సంప్రదించగలరని లోకేశ్ ప్రశ్నించారు. తక్షణమే సీఎం జగన్ మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని ఉన్నతాధికారులు మణిపూర్ ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక విమానంలో రాష్ట్ర విద్యార్థులు అందరినీ తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు.
మణిపూర్‌లో ఉన్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థులను కాపాడటంపై లేదా అని మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. జగన్ కి తెలుగు విద్యార్థుల సమస్యలు పట్టవా అని అచ్చెన్న ఆక్షేపించారు. రంగులు వేయటం కోసం, వైసీపీ ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.. కానీ ఆపదలో ఉన్న విద్యార్థులను ఆదుకోరా అని నిలదీశారు.
ఇవీ చదవండి: