SC on R5 Zone: రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్-5 జోన్ జీవోలను సవాల్ చేస్తూ అమరావతి రైతులు కట్టా రాజేంద్రవరప్రసాద్, ఉట్ల శివయ్య దాఖలు చేసిన కేసు సోమవారం జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓక్, జస్టిస్ రాజేష్ బిందల్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. వాదనలు ప్రారంభమైన వెంటనే జస్టిస్ ఓక్ జోక్యం చేసుకుంటూ హైకోర్టు ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పినందున రాజధాని కేసుతో పాటు ఈ కేసును అదే ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని అభిప్రాయపడ్డారు.
రైతుల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం స్థలాల కేటాయింపునకు సన్నద్ధం అవుతోందని, అదే జరిగితే మొత్తం ప్రాజెక్టు దెబ్బతింటుందని పేర్కొన్నారు. అలా ఏమీ జరగదులే అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మరో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే జోక్యం చేసుకుంటూ ఇది ఈడబ్ల్యూఎస్ పథకమని, ఒకసారి అమలు చేస్తే మళ్లీ వెనక్కు తీసుకోవడం సాధ్యం కాదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
జస్టిస్ ఓక్ స్పందిస్తూ రెండు కేసులను తక్షణం విచారించాలని తాము చెబుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్థలాలు కేటాయించేలా జీవో తీసుకొచ్చిందని ముకుల్ రోహత్గీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఎలాంటి కేటాయింపులు జరుపకుండా చూడాలని హరీష్ సాల్వే విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తి స్పందిస్తూ హైకోర్టు ఇప్పటికే ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వు ఉందని చెప్పింది కదా అని ప్రశ్నించారు. అది సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని రోహత్గీ బదులిచ్చారు. ఆ ఉత్తర్వులు తమకు అనుకూలంగా ఉన్నాయని హరీష్ సాల్వే చెప్పారు.
అమరావతి రాజధానికి సంబంధించిన కేసులు జులై 11న ఐటం నం.1 కింద లిస్ట్ అయ్యాయని, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన జీవో మొత్తం స్థలాలు తక్షణం కేటాయించాలని చెబుతోందని హరీష్ సాల్వే ధర్మాసనానికి చెప్పారు. మేం ఆ కేసులను కూడా ముందుకు జరపాలని కోరుకుంటున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగైతే వెంటనే చేపట్టేలా ఉత్తర్వులివ్వాలని రోహత్గీ కోరారు. అంతవరకు మధ్యంతర ఉపశమనం కలిగించాలని, లేదంటే ప్రభుత్వం కేటాయింపులు జరుపుతుందని విజ్ఞప్తి చేశారు. జస్టిస్ ఓక్ స్పందిస్తూ ఈ కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, మరోవైపు రాజధాని కేసులు తమ ముందు లేవని.. అందువల్ల వీటిల్లోని ఉత్తర్వులను ఒకదానితో ఒకటి అన్వయించడం సరికాదన్నారు.
హైకోర్టు ఉత్తర్వుల్లోని రాజధాని నిర్మాణం కొనసాగించాలన్న ప్రధాన అంశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని, కేవలం అందుకు సంబంధించిన గడువులపై మాత్రమే ఇచ్చిందన్న విషయాన్ని గమనించాలని హరీష్ సాల్వే కోరారు. తర్వాత జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓక్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత పిటిషన్లను తక్షణం పరిగణలోకి తీసుకొని, ఎస్‌ఎల్‌పీతో కలిపి ఈ వారంలో తగిన బెంచ్ ముందు లిస్టింగ్ చేయడానికి తక్షణం సీజేఐ నుంచి ఉత్తర్వులు తీసుకోవాలని రిజిస్ట్రీని నిర్దేశిస్తున్నామని జస్టిస్ ఓక్ ఆదేశించారు.
రైతుల తరఫున మరో సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ జోక్యం చేసుకుంటూ అమరావతి కేసు తుది విచారణ కోసం జులై 11కి వాయిదా వేశారని, అందువల్ల ఆ కేసును కూడా ఇప్పుడే వినాలన్న భావన రానీయకుండా.. ఈ కేసును అత్యవసర మధ్యంతర ఉత్తర్వుల కోసం లిస్ట్ చేసేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. తాము ఈ కేసును తక్షణం విచారించాలని చెప్పామని జస్టిస్ ఓక్ స్పష్టం చేశారు. మరోవైపు కేసును తదుపరి బుధవారం విచారించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ముకుల్ రోహత్గీ, శ్యాం దివాన్, దేవదత్ కామత్‌లు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: