AP draft voters list: రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు. నవంబరు 9 నాటికి రాష్ట్రంలో 3,98,54,093 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో 2,01,34,621 మంది మహిళా ఓటర్లు, 1,97,15,614 మంది పురుష ఓటర్లు ఉన్నారని.. సర్వీసు ఓటర్ల సంఖ్య 68,115, ట్రాన్స్ జెండర్ ఓటర్ల సంఖ్య 3,858 మంది ఉన్నారని పేర్కొన్నారు. 18-19 ఏళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య 78,438గా ఉందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాలతో 10,52,326 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారన్నారు.
డూప్లికేట్ ఓటర్లు, మృతులు, ఒకే పేరుతో వేర్వేరు చోట్ల నమోదైన ఓట్లను తొలగించినట్లు రాష్ట్ర ఎన్నిక ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా నకిలీ ఓటర్ల పేర్లను ఈసీ తొలగించిందన్నారు. గత ఏడాది ఓటర్ల జాబితాతో పోలిస్తే 8,82,366 ఓటర్ల సంఖ్య తగ్గిందన్నారు. ఓటరు కార్డు కోసం ఆధార్‌ను తప్పనిసరి చేయటం లేదని స్పష్టం చేశారు. అయితే ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే 60 శాతం మేర పూర్తైందని స్పష్టం చేశారు. ఓటరు నమోదు కోసం వాలంటీర్ల సేవలను వాడుకోవద్దని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు.
"రాష్ట్రంలో 2.01 కోట్ల మంది మహిళా ఓటర్లు. రాష్ట్రంలో 1.97 కోట్ల మంది పురుష ఓటర్లు. రాష్ట్రంలో 18-19 ఏళ్ల వయసున్న ఓటర్లు 78,438. రాష్ట్రంలో సర్వీసు ఓటర్లు 68,115. ఓటర్ కార్డు కోసం ఆధార్‌ను తప్పనిసరి చేయడం లేదు. ఓటర్-ఆధార్ అనుసంధాన ప్రక్రియ మాత్రం 60 శాతం పూర్తి. ఈసారి నిరాశ్రయులకూ ఓటర్ కార్డు ఇవ్వాలని నిర్ణయం. ఓటర్ల నమోదుకు వాలంటీర్ల సేవలు వాడుకోవద్దని కలెక్టర్లను ఆదేశించాం. ఎమ్మెల్సీ పట్టభద్రులు, టీచర్ ఓటర్ల నమోదులో ఫిర్యాదులు వచ్చాయి. తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటాం. అన్నీ పరిశీలించి నిరాశ్రయులకూ ఓటర్ కార్డు ఇస్తాం." -ముకేష్ కుమార్ మీనా, ఎన్నికల ప్రధానాధికారి
ఎమ్మెల్సీ పట్టభద్రులు, టీచర్ల ఓటర్ల నమోదు ప్రక్రియపై ఫిర్యాదులు వచ్చాయని.. దీనిపై 19వ తేదీ వరకూ విచారణ చేపడుతున్నామని ముకేష్ కుమార్ మీనా తెలిపారు. తప్పుడు ధ్రువీకరణ ఇచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈసారి నిరాశ్రయులకూ ఓటరు కార్డు ఇవ్వాలని ఈసీ నిర్ణయించిందన్నారు, ఎలాంటి గుర్తింపు లేకపోయినా విచారణ అనంతరం వారికి ఓటరు కార్డు జారీ చేస్తామని ప్రకటించారు.
ఇవీ చదవండి: